పిలవని అతిథులతో పెళ్లికొడుకు అవాక్కు

19 Apr, 2015 10:19 IST|Sakshi
పిలవని అతిథులతో పెళ్లికొడుకు అవాక్కు

కాబూల్: సాధారణంగా పెళ్లి వేడుకలంటే అమ్మాయి తరుపు వారు, అబ్బాయితరుపువారు, స్నేహితులు, పెళ్లి పనులు చేసే వారుంటారు. కొన్ని పెళ్లి వేడుకల్లో పిలవకపోయినా వచ్చే అతిథులు సరాసరే! అలాంటి వారు ఒక్కరో ఇద్దరో ఆపై ముగ్గురో.. కానీ ఊహించని విధంగా ఏకంగా ఆరు వందలమంది అమ్మాయి తరుపు, అబ్బాయి తరుపు కానీ అథిధులు పెళ్లి వేడుకకు వస్తే ఎలా ఉంటుంది అవాక్కయిపోరూ.. ఇలాంటి పరిస్థితే అప్ఘానిస్థాన్లో షాఫికుల్లా ఓ కార్ల వ్యాపారికి ఎదురైంది. తాను ఎంతో ఇష్టపడి ఏర్పాటుచేసుకున్న పెళ్లి వేడుకకు అనుకోని అతిథులు 600 మంది వచ్చారు.

వాళ్లలో ఏ ఒక్కరూ కూడా తెలిసినవారు లేకపోవడంతో అవాక్కయ్యాడు. పోనీ ఏదైనా అందామంటే పెళ్లిలో భోజనం పెట్టేందుకు కూడా కకృతి పడ్డావా అని అంటారేమోనని, చులకనగా చూస్తారేమోనని మదనపడ్డాడు. చివరికి వేరే దారేం లేక అప్పటికప్పుడు 600మందికి సరిపోయే భోజనానికి ఆర్డరిచ్చి తెప్పిచ్చాడు. ఆ విషయంపై స్వయంగా తానే ఓ మీడియాకు వెల్లడిస్తూ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న తన పెళ్లి వేడుక గందరగోళానికి, రచ్చరచ్చకు తావివ్వకూడదనే ఊరుకున్నానని, అందరికీ విందు వడ్డించానని తెలిపాడు. ఈ ప్రాంతంలో ఒకరి భోజనం భరించడమంటే పర్సుకు భారీ చిల్లు పడ్డట్లే. అందుకే అతడు తెగ వర్రీ అయిపోయాడు.

మరిన్ని వార్తలు