బుర్హాన్‌ వనీ వారసుడు కూడా..!

27 May, 2017 14:43 IST|Sakshi
బుర్హాన్‌ వనీ వారసుడు కూడా..!

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో అలజడి రేపుతున్న వేర్పాటువాద మిలిటెంట్‌ సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిబ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ స్థానంలో అతని వారసుడిగా పగ్గాలు చేపట్టిన మరో ఉగ్రవాది సబ్జార్‌ అహ్మద్‌ కూడా భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. శనివారం జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు మరణించారు. ఇందులో సబ్జార్‌ కూడా ఉన్నాడని భద్రతా దళాలు తెలిపాయి. పుల్వామా జిల్లాలోని ట్రాల్‌ సెక్టార్‌లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఏరివేయగా.. బారాముల్లా జిల్లాలోని రాంపూర్‌ సెక్టార్‌లో ఎల్‌వోసీ మీదుగా చొరబాటుకు ప్రయత్నించిన ఆరుగురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది.

ట్రాల్‌లోని ఓ ఇంటిలో అబు జరార్‌ అలియాస్‌ సబ్జార్‌ అహ్మద్‌, ఓ పాకిస్థానీ ఉగ్రవాదితో కలిసి నక్కి ఉండగా.. భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుమట్టాయి. ఈ సందర్బంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ ఇద్దరూ ప్రాణాలు విడిచాడు. హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడంతో కశ్మీర్‌లో ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే.

ఇక, ఉడీకి సమీపంలో ఉన్న రాంపూర్‌లో తెల్లవారుజామున ఎల్‌వోసీ మీదుగా అనుమానాస్పద కదలికలు ఉండటంతో వెంటనే అలర్ట్‌ అయిన సైన్యం ఈ భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసింది. ఉడీ సెక్టార్‌లో శుక్రవారం జరిగిన చొరబాటు యత్నాన్ని సైన్యం సమర్థంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. పాక్‌ బార్డర్‌ యాక్షన్‌ టీమ్‌ (బ్యాట్‌)కు చెందిన ఇద్దరు చొరబాటుదారులు ఉడీ సెక్టార్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించగా..  వారిని సైన్యం ఏరిపారేసింది.
 

మరిన్ని వార్తలు