వగలాడి వల.. లక్షకు పైగా స్వాహా

11 Feb, 2017 12:04 IST|Sakshi
వగలాడి వల.. లక్షకు పైగా స్వాహా
అతడి పేరు దినేష్ శర్మ. ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటాడు. ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా అంటే ఎక్కడ లేని ఇష్టం. అదే పిచ్చితో ఒక వగలాడి విసిరిన వలలో పడి దాదాపు లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు అయితే చేశాడు గానీ, ఆ డబ్బు తిరిగి రావడం అసాధ్యమని వాపోతున్నాడు. ఒక టెలికం కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేసే దినేష్‌కు తాను లండన్‌లో ఉంటున్నానని చెప్పిన నేహా బజాజ్ అనే అమ్మాయితో సోషల్ మీడియాలో స్నేహం కుదిరింది. ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. అతడి జీతం, ఉద్యోగం, ఇతర ఆర్థిక పరిస్థితులు కూడా అడిగింది. తన తండ్రి భారతీయుడని, అందువల్ల ఇక్కడకు రావాలనుకుంటున్నానని చెప్పింది. ఇక్కడ హోటళ్లు బుక్ చేసుకోవడానికి ఎవరూ తెలియదని చెప్పడంతో తాను సాయం చేస్తానని దినేష్ ముందుకొచ్చాడు. దాంతో ఆమె తాను కొన్ని బహుమతులు పంపుతానని కూడా చెప్పింది. 
 
ఒకరోజు ఆమె దినేష్‌కు కొరియర్ వివరాలు, రసీదు, రిఫరెన్సు నంబర్లు కూడా ఇచ్చింది. టెడ్డీబేర్, ఒక ల్యాప్‌టాప్, వాచీ, కొన్ని పౌండ్ల డబ్బు అందులో ఉన్నాయని చెప్పింది. దాన్ని డిప్లొమాటిక్ కొరియర్ సర్వీసులో పంపానని, దాన్ని క్లియర్ చేయాలంటే భారతీయ కరెన్సీలో కొంత డబ్బు చెల్లించాలని వివరించింది. పార్సిల్ భారతదేశానికి రాగానే కస్టమ్స్ క్లియరెన్స్ కోసం తనను రూ. 23600 కట్టమన్నారని దినేష్ చెప్పాడు. దాంతో అతడు చెప్పిన బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వేశాడు. అదే రోజు పెద్దనోట్లను రద్దు చేయడంతో, వాళ్లు డబ్బులు డ్రా చేసుకోలేకపోతున్నామని, అందువల్ల నగదు రూపంలో డబ్బు చెల్లించాలని చెప్పారు. ఆ తర్వాత రూ. 85వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని, లేకపోతే ప్యాకెట్ డెలివరీ ఇవ్వడం కుదరదని అన్నారు. ఈ మధ్యలో నేహా కూడా తరచు ఫోన్ చేస్తూ త్వరగా పార్సిల్ తీసుకోవాలని తొందరపెట్టేది. లేకపోతే తానంటే ప్రేమ లేదా అని కూడా అడిగేది. 
 
ఆ మొత్తం కట్టేసిన తర్వాత కూడా.. వాళ్లు తమకు డబ్బులు అందలేదని, నిబంధనలు కఠినం అయినందువల్ల తాము ఆ ప్యాకెట్‌ను రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లండ్‌కు పంపుతున్నామని, వాళ్లు పౌండ్లను రూపాయలలోకి మారుస్తారని చెప్పారు. దాంతో దినేష్ శర్మకు అప్పుడు అనుమానం వచ్చింది. నగదు మార్పిడి కోసం రూ. 2 లక్షలు కట్టాలన్నప్పుడు అనుమానం బలపడింది. దాంతో బ్యాంకు అధికారులను సంప్రదించగా, వాళ్లు ఇదంతా పచ్చిమోసం అని చెప్పారు. ఢిల్లీలో దాదాపు ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు ఉంటూనే ఉంటాయని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ మనీష్ యాదవ్ చెప్పారు. 
మరిన్ని వార్తలు