‘స్వలింగసంపర్కం’ రాజ్యాంగ ధర్మాసనానికి

3 Feb, 2016 04:05 IST|Sakshi
సుప్రీం కోర్టు వద్ద గేల సంబరం

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం క్యురేటివ్ పిటిషన్‌ను ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377ను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందులో మానవ సంబంధాలకు సంబంధించిన ముఖ్య, అమూల్య అంశాలెన్నో ముడిపడివున్న దృష్ట్యా విస్తృత బెంచ్‌కు నివేదిస్తున్నట్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ జేఎస్ ఖేహార్‌ల బెంచ్ వ్యాఖ్యానించింది. త్వరలోనే బెంచ్ ఏర్పాటవుతుందని వెల్లడించింది. ప్రకృతి విరుద్ధమైన స్వలింగ సంపర్కం నేరమంటూ 1860లో బ్రిటిష్ రాజ్ వే సెక్షన్ 377ను అమల్లోకి తెచ్చింది.

దీనికి విరుద్ధంగా ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పునిచ్చింది. అయితే సుప్రీం కోర్టు ఈ తీర్పును నిలుపుదల చేసింది. తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ నాజ్ ఫౌండేషన్‌తో పాటు మరికొంతమంది సుప్రీమ్ కోర్టులో రివ్యూ పిటిషన్లు వేశారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని గే ఉద్యమకారులు స్వాగతించారు. కోర్టు నిర్ణయాన్ని  కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్వాగతించారు. స్వలింగ సంపర్క చట్టబద్ధతపై  కేంద్రం ఎలాంటి అభిప్రాయానికీ రాలేదని మంత్రి వెంకయ్య చెప్పారు.

మరిన్ని వార్తలు