హోటళ్లు, థియేటర్లు ఇక 24గంటలు

25 Sep, 2016 20:01 IST|Sakshi

ముంబై మహానగరంలో హోటళ్లు, థియేటర్లు, మాల్స్, కాఫీ హౌస్ లు ఇక 24X7 నడవనున్నాయి. యువసేన చీఫ్ ఆదిత్య ఠాక్రే 2013లో చేసిన ఈ ప్రపోజల్ ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. నైట్ ప్లాన్ కింద దీనిని ఆదిత్య వివరించినప్పుడు బీజేపీ, మిగిలిన రాజకీయపార్టీలు దీన్ని వ్యతిరేకించాయి. కేవలం బడా వ్యాపారులకు మాత్రమే ఈ ప్లాన్ ఉపయోగపడుతుందని ఆరోపించాయి.

ప్రతిపక్షాల వ్యాఖ్యలపై స్పందించిన ఆదిత్య నైట్ లైఫ్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్న వారికి ముంబై నగరం గురించి తెలియదని అన్నారు. ఈ స్కీమ్ అందరికీ వర్తింస్తుందని చెప్పారు. నైట్ లైఫ్ ప్లాన్ కు ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా ఆమోదం కూడా పడింది. ఫుడ్ స్ట్రీట్ ల ఎంపిక కూడా పూర్తయింది. వీటిలో బీకేసీ, డాక్ యార్డు, నారిమన్ పాయింట్లు కూడా ఉన్నాయి.

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారంలో ఉన్న శివసేన, కేంద్రప్రభుత్వాలు కూడా ఈ స్కీమ్ బిల్లును పాస్ చేశాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం మాత్రమే మిగిలివుందని ఆదిత్య తెలిపారు. నైట్ లైఫ్ ప్లాన్ ద్వారా రాష్ట్ర రెవెన్యూని పెంచుకోవచ్చని తెలిపారు. కొత్త ఉద్యోగాలను సృష్టించుకోగలగడమే కాకుండా పర్యాటక రంగం కూడా వృద్ధి చెందుతుందని చెప్పారు. ప్లాన్ లో భాగస్వామ్యమయ్యే హోటళ్ల కు సింగింల్ విండో పద్ధతి ద్వారా లైసెన్స్ లు మంజూరు చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు