బెంగాల్ అత్యాచార బాధితురాలికి ఇల్లు, ఉపాధిహామీ పని

1 Feb, 2014 15:51 IST|Sakshi

పశ్చిమబెంగాల్ అత్యాచార బాధితురాలిని ఊళ్లోకి రానిచ్చేది లేదని గ్రామస్థులు అంటుండటంతో.. గ్రామ సమీపంలోనే ఓ ఇల్లు కట్టించి ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం కింద ఉద్యోగం ఇవ్వాలని ఆ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఆమె గ్రామానికి సమీపంలోనే ఇందిరా ఆవాస్ యోజన కింద ఓ ఇల్లు కట్టించి ఇవ్వబోతున్నట్లు పశ్చిమబెంగాల్ మహిళా, శిశు సంక్షేమ మంత్రి శశి పంజా తెలిపారు. దాంతోపాటు ఆమెకు పోలీసు రక్షణ కూడా కల్పిస్తామన్నారు. బాధితురాలితో తాము మాట్లాడామని, ఇంతకుముందు ఆమె రోజు కూలీగా పనిచేసింది కాబట్టి అదే పని ఇప్పిస్తామని తెలిపారు.

ఆమె ఎటూ నిరక్షరాస్యులు కాబట్టి, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసేందుకు అంగీకరించినట్లు మంత్రి చెప్పారు. జనవరి 21వ తేదీన 13 మంది వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఆమెను శుక్రవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ సంక్షేమ గృహానికి తరలించారు. ఆమెకు అన్ని రకాలుగా సాయం చేసేందుకు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. నిందితులు 13 మందీ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

మరిన్ని వార్తలు