ఇంటి మనీ మేనేజర్ మీరేనా!

8 Jun, 2015 00:07 IST|Sakshi

కుటుంబ ఆర్థిక నిర్వహణ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం. సంపాదిస్తే సరిపోదు. ఆ సంపాదనని సరిగ్గా వినియోగించుకోవడమూ ఎంతో ముఖ్యం. డబ్బు నిర్వహణ సమర్ధంగా ఉంటే ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడుతుంది. విహార యాత్రలు, పిల్లల పెళ్లిళ్లు, భవిష్యత్తులో ఆస్తుల కొనుగోలు, ఒకవేళ రుణాలు ఏవైనా ఉంటే వాటిని సకాలంలో తీర్చడం.. ఇలా పలు కోణాల్లో కుటుంబ ఆర్థిక నిర్వహణ మంచి ఫలితాలను అందజేస్తుంది.

తగిన ప్రణాళిక, ఆ ప్రణాళిక నిర్వహణ ద్వారా కుటుంబ ఆర్థిక బాట ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. ఇక ఇంట్లో ఉన్న పెద్దలు అందరూ సంపాదించేవారే అయితే... ఆ డబ్బు సమర్థవంతమైన నిర్వహణలో కుటుంబ సారథికి ఎన్నో మెళకువలు అవసరం. సంపాదించే వారికి వారివారి వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి. వారి ఇష్టాలు-అయిష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి. అదే సమయంలో కుటుంబ వ్యయాల విషయాలను ఆలోచించాలి.  ఆయా అంశాల ప్రాతిపదికన ఇంటి పెద్ద డబ్బు నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. ఆర్థిక నిర్వహణ భారం కాకుండా తేలిగ్గా సాగిపోయేలా కొన్ని మెళకువలను చూస్తే...

 ఉమ్మడి అవగాహన ఉండాలి...
 ఇంట్లో సంపాదించేవారందరి మధ్యా రాబడి-వ్యయాల అంశాలపై ఉమ్మడి అవగాహన అవసరం. దీనివల్ల సంపాదించే కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి పొరపొచ్చాలకూ వీలుండదు. గృహ రుణం ఏదైనా ఉంటే- చెల్లింపులు, పిల్లల చదువులకు సంబంధించి ఫీజులు, టెలిఫోన్ చార్జీల వంటి ఇతర నెలవారీ చెల్లింపులు, కుటుంబ ఖర్చులు ఇలా ప్రతి అంశంపై ఉమ్మడి అవగాహనతో ముందుకు వెళ్లాలి.

 స్టీరింగ్ ఒకరివద్దే ఉండాలి...
 డబ్బు కుటుంబంలో పెద్దలందరూ సంపాదిస్తున్నా... నిర్వహణ ఒకరి చేతుల్లోనే ఉండడం మంచిది. దీనివల్ల కుటుంబంలో చక్కని ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది. సహజంగా మన సమాజంలో కుటుంబ పెద్దే ఇంటి ఆర్థిక బాధ్యతల నిర్వహిస్తుంటాడు.

 వ్యయానికి ఉమ్మడి నిబంధనలు..: వ్యయాల విషయంలో కుటుంబ సభ్యులు అందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలు ఉండాలి. కొందరికి మినహాయింపులు ఇవ్వడం వల్ల అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చుచేయడంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి కుటుంబంలోని సభ్యులు అందరికీ మంచి అవగాహన అవసరం. ఈ విషయంలో కుటుంబ పెద్ద చేయాల్సింది ఎంతో ఉంటుంది.

 వ్యక్తిగత ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి...
 ఇంట్లో పలువురు సంపాదించేవారుంటే... మనీ మేనేజ్‌మెంట్ చేసే కుటుంబ పెద్ద వారి వ్యక్తిగత ప్రాధాన్యతలను అర్థం చేసుకోవాలి. అలాగే కుటుంబం పెద్దదైతే... డబ్బు ఆర్జించేవారి అలాగే సంపాదించనివారి ప్రాధాన్యతలనూ, అవసరాలనూ గుర్తెరగాలి. డబ్బు ఎవరికి ఎలా కేటాయించాలన్న అంశంపై ఒక నిర్దిష్టమైన అవగాహన అవసరం. ప్రాధాన్యతల క్రమంలో వ్యక్తుల అవసరాలకు డబ్బు కేటాయింపులు జరపాలి. పొదుపు ప్రాముఖ్యత గురించి కుటుంబ సభ్యులు అందరి మధ్యా అవగాహన పెంచడానికి కూడా కుటుంబ పెద్ద ప్రయత్నం చేయాలి.

 డబ్బు కేటాయింపు..
 రుణ బకాయిల నెలవారీ చెల్లింపులు, చదువుకు సంబంధించి ఫీజులు, బీమా చెల్లింపులు వంటి అత్యవసర, తప్పనిసరి పేమెంట్లకు డబ్బు అప్పటికప్పుడు కాకుండా ముందే కేటాయింపులు జరుపుకుని, ముందుగానే డబ్బు సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల ఆర్థిక ఒత్తిడులను నివారించే వీలుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆయా అంశాలపై ముందుగానే చక్కటి అవగాహన అవసరం. ప్రతి ఒక్కరూ కుటుంబ వ్యయాల పైన పూర్తి బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో మెలగడానికి వీలవుతుంది.

>
మరిన్ని వార్తలు