ఈపీఎఫ్‌ఓ చందాదారులకు ఇళ్లు..!

11 Mar, 2015 01:53 IST|Sakshi
ఈపీఎఫ్‌ఓ చందాదారులకు ఇళ్లు..!

న్యూఢిల్లీ: ఐదు కోట్ల మంది చందాదారులకు గృహ నిర్మాణ పథకాన్ని అందుబాటులోకి తేవాలన్న ప్రతిపాదనపై ఈపీఎఫ్‌ఓ (భవిష్య నిధి) ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తమ పెన్షన్ నిధి చందాదారులకు గృహ నిర్మాణ పథకాన్ని ఎలా అమలు చేయాలనే అంశంతో పాటు ఇతర అంశాలనూ పరిశీలించి, నెల రోజుల్లోగా ఒక నివేదికను అందజేసింది. దీనికి ఛైర్మన్‌గా మనీష్ గుప్తాను నియమించారు. సామాజిక ప్రయోజనాల కింద ఈపీఎఫ్‌వో చందాదారులకు గృహాల నిర్మాణ ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నట్లు గత వారం కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పార్లమెంటులో ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
ఈపీఎఫ్‌ఓ దాదాపు 6.5 లక్షల కోట్ల ఫండ్‌ను నిర్వహిస్తోంది. దీనికి వార్షికంగా రూ.70వేల కోట్లు జమవుతూ వస్తున్నాయి. దీంతో ‘2022 నాటికి అందరికీ ఇళ్లు’ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అందుబాటు ధరల్లో ఇళ్లను అందించేలా మెగా హౌసింగ్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీంట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్‌బీసీసీ వంటి ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థలు, హుడా, డీడీఏ, పుడా వంటి స్థానిక సంస్థలనూ భాగస్వాముల్ని చేయాలని చూస్తోంది.
 
రూ.15వేల లోపువారే అధికం...
ఈపీఎఫ్‌ఓ చందాదారుల్లో రూ.15000 కన్నా తక్కువ బేసిక్ ఉన్నవారే దాదాపు 70 శాతం మంది. దీంతో వీరందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించే పథకం గురించి ఆలోచించాలని, అందుకోసం నిధులను ఉపయోగించాలని ఈపీఎఫ్‌ఓను కోరుతూ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఇటీవల ఓ నోట్‌ను పంపింది. ‘‘ఈపీఎఫ్‌ఓ నిధుల్లో 15 శాతం తీస్తే రూ.70వేల కోట్లవుతాయి. దీంతో 3.5 లక్షల ఇళ్లు నిర్మించొచ్చు’’ అని ఆ నోట్‌లో పేర్కొంది.

మరిన్ని వార్తలు