రుణమాఫీ చేయకుండా రైతుయాత్రలా!

5 Sep, 2015 18:04 IST|Sakshi
రుణమాఫీ చేయకుండా రైతుయాత్రలా!

రైతులకు రుణమాఫీ చేయకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు యాత్రలు ఎలా చేస్తారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా డ్వాక్రా యాత్రలు కూడా చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. మ్యానిఫెస్టో అంతా కూడా అమలు చేసేశామని యాత్రలు చేసేట్టున్నారన్నారు. ఓటుకు కోట్ల కేసుకు భయపడి గతంలో కేబినెట్ సమావేశాన్ని విజయవాడలో పెట్టారని, ఇప్పుడు మళ్లీ విజయవాడలో పెడితే రైతులు అడ్డుకుంటారని హైదరాబాద్లో పెట్టారని విమర్శించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పగటిపూట నిరంతరం 12 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారని, అధికారంలోకి రాగానే 7 గంటలు ఇస్తామని మాట మార్చారని, కానీ ఇప్పుడు 7 గంటలు ఇచ్చేది కూడా అనుమానమేనని అన్నారు. ఇక రాజధాని నగర నిర్మాణంలో సింగపూర్ పాత్రపై తమకు అనుమానాలున్నాయని పార్థసారథి చెప్పారు. చంద్రబాబు తన ఆస్తులు కాపాడుకోడానికి సింగపూర్ ప్రభుత్వానికి ఇక్కడి రాజధాని పనులు అప్పగించారని ఆరోపించారు. బందరు పోర్టుకు అన్నివేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. గతంలో వైఎస్ ఎప్పుడూ బహుళ పంటలు పండే భూములు ఇవ్వలేదని, ఇప్పుడు మాత్రం ప్రభుత్వం బందరు పోర్టుకు వేలాది ఎకరాలు ఎందుకు ఇస్తోందని నిలదీశారు.

మరిన్ని వార్తలు