దాసరి-పద్మల ప్రేమకథ మొదలైందిలా..

31 May, 2017 11:16 IST|Sakshi
దాసరి-పద్మల ప్రేమకథ మొదలైందిలా..

హైదరాబాద్‌: అస్థిర బంధాలు అధికంగా కనిపించే సినీరంగంలో దాసరి నారాయణరావు- పద్మ జంటది అరుదైన ప్రస్థానం. సినిమాలతో సమానంగా భార్య పద్మను ప్రేమించిన దాసరి.. ఆమె చనిపోయిన తర్వాత ఒంటరితనాన్ని అనుభవించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచిన ఆయన.. తన పద్మ చెందకే వెళ్లిపోయారు. నారాయణరావు-పద్మలది ప్రేమవివాహం. అసలు వాళ్లిద్దరూ ఎక్కడ, ఎప్పుడు, ఎలా కలిశారంటే..

దాసరి నారాయణరావుకు చెన్నై కంటే హైదరాబాద్ అంటేనే ఇష్టం. సినీపరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలుతున్న తొలిరోజుల్లోనే ఆయన భాగ్యనగరికి వచ్చేశారు. ఇక్కడి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న చార్మినార్‌ (వీఎస్‌టీ) సిగరెట్ కంపెనీలో మొదట చిన్న ఉద్యోగం చేశారు. ఆ తరువాత హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లోనూ పనిచేశారు. సమాంతరంగా నాటకరంగంపైనా దృష్టిసారించారు. రవీంద్రభారతి, గాంధీభవన్‌, త్యాగరాయగానసభల్లో వందలాది నాటకాలు ప్రదర్శించారు. ఓసారి సొంత ఊరు(పాలకొల్లు)కు బయలుదేరిన ఆయన.. తన చెల్లెలకి గాజులు కొందామని పాతబస్తీలోని సుల్తాన్ బజార్ వెళ్లారు..

‘షాపు వాడు ఏ సైజు కావాలి?’ అని ప్రశ్నించడంతో దాసరికి ఏం చెప్పాలో పాలుపోలేదు. అప్పుడు పక్కనే నిల్చుని గాజులు కొంటున్న ఓ అమ్మాయి చెయ్యిని చూపించి ‘ఈ సైజువి కావాలి’ అని చెప్పారు. ఆ అమ్మాయి ఎవరో కాదు పద్మ! నాటకాలపట్ల ఆసక్తికలిగిన ఆమె.. నారాయణరావును చూడగానే ‘మీరు నాటకాలు వేస్తారుకదా. గాంధీభవన్‌లో మీ ప్లే చూశా’నని అన్నారట. అలా మొదలైనవారి పరిచయం ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకునేదాకా, అటుపై గాఢమైన ప్రేమగా మారింది. కొద్ది రోజులకే పెళ్లిచేసుకోవాలని డిసైడ్‌ అయ్యారు.


పద్మ స్వస్థలం ఖమ్మం జిల్లా. ఆమె తల్లిదండ్రులు సరేనన్నారుకానీ, నారాయణరావు కుటుంబం మాత్రం పెళ్లికి అభ్యంతరం తెలిపింది. అయినాసరే ఇద్దరూ ఒక్కటయ్యారు. సొంత పిల్లలు ముగ్గురే (కొడుకులు ప్రభు, అరుణ్ కుమార్, కూతురు హేమాలయ కుమారి) అయినా, ఇండస్ట్రీలో కొన్ని వందల మందికి దాసరి-పద్మలు అమ్మానాన్నలయ్యారు. దాసరి పార్థివ దేహాన్ని సందర్శించిన నటీనటులు, టెక్నీషియన్లు.. ఆ అమ్మానాన్నలతో తమ అనుబంధాన్ని తలుచుకుని కన్నీటిపర్యంతం అయ్యారు.

మరిన్ని వార్తలు