డోక్లాం పరిష్కారం: తెర వెనుక ఉన్నదెవరు?

30 Aug, 2017 11:42 IST|Sakshi
డోక్లాం పరిష్కారం: తెర వెనుక ఉన్నదెవరు?

న్యూఢిల్లీ: భారత్‌, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపిన డోక్లాం సరిహద్దు వివాదానికి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటన నేపథ్యంలో అనూహ్యంగా తెరపడింది. 73 రోజులపాటు తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ వివాదం.. భారత్‌, చైనా, భూటాన్‌ ట్రైజంక్షన్‌ అయిన డోక్లాం కొండప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడానికి భారత్‌-చైనా అంగీకరించడంతో శాంతియుతంగా పరిష్కారం అయింది. చైనా మీడియా, ఆ దేశ అధికారులు డోక్లాం వివాదంపై రోజుకో రెచ్చగొట్టే వ్యాఖ్య చేసినా.. భారత్‌ మాత్రం పరిణతితో హుందాగా రాజకీయ మౌనాన్ని పాటించింది. అవసరమైనప్పుడు మాత్రమే చైనా వాదనను తిప్పికొట్టింది. మరి, ఈ వివాదం సామసర్యంగా ముగియడంలో తెరవెనుక ఉన్నదెవరు అంటే.. అది జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌. ఆయన బృందమే అని చెప్పాలి.

మొండి వితండవాదం చేస్తున్న చైనాతో ధోవల్‌, ఆయన బృందం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రత్యర్థికి గణనీయమైన నష్టాన్ని చేకూర్చగలమన్న ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ ఆత్మవిశ్వాసం నేపథ్యంలో క్షేత్రస్థాయిలో దృఢవైఖరిని అవలంబిస్తూనే.. చైనాతో దౌత్య చర్చలను  దోవల్‌ బృందం తెలివిగా ముందుకు తీసుకెళ్లింది.

గత జూలై 27న బీజింగ్‌లో ధోవల్‌ చైనా స్టేట్‌ కౌన్సిలర్‌ యాంగ్‌ జీచితో తొలిసారి భేటీ అయి దౌత్య చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 'ఇది మీ భూభాగమా?'అని యాంగ్‌ ప్రశ్నించగా.. ఈ ప్రశకు ఏమాత్రం తొణక్కుండా 'ప్రతి వివాదాస్పద ప్రాంతం చైనాకే చెందుతుందా?'అని దోవల్‌ దీటుగా ప్రశ్నించినట్టు సమాచారం. భూటాన్‌ భూభాగంలో రోడ్డు నిర్మించడం ద్వారా మూడు దేశాల ట్రైజంక్షన్‌లో చైనా స్టేటస్‌కో మార్చివేసిందని దోవల్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతేకాకుండా చారిత్రక ఒడంబడికలకు అనుగుణంగా భూటాన్‌ భద్రతను కాపాడాల్సిన భారత్‌కు ఉందని గుర్తుచేశారు. అయితే, డోక్లాంకు బదులుగా 500 చదరపు కిలోమీటర్ల భూటాన్‌ భూభాగాన్ని తిరిగి ఇస్తామని చైనా ఆఫర్‌ చేసినా భారత్‌ తిరస్కరించింది. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్‌ జైశంకర్‌, చైనాలోని భారత రాయబారి విజయ్‌ గోఖలే, ఆర్మీ చీఫ్‌ రావత్‌, మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌ భట్‌ తదితరులు చైనా బృందంతో చర్చలు జరిపినవారిలో ఉన్నారు.



ఇటు ప్రధాని నరేంద్రమోదీ, అటు చైనా అధ్యక్షుడు గ్జి జింపింగ్‌ ఈ దౌత్యచర్చలకు ఆమోదం తెలిపినప్పటికీ.. రాజకీయ మౌనాన్ని పాటించడంతో తెరవెనుక ఏం జరుగుతున్నది పెద్దగా తెలియలేదు. జీ20 సదస్సు సందర్భంగా హంబర్గ్‌లో భేటీ అయిన ఇద్దరు అధినేతలు డోక్లాం వివాదం మరింత ఉద్రిక్తతలు రాజేయకుండా ఉండేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే డోక్లాం వివాదం సత్వరంగా ముగిసేలా చూడాలని ప్రధాని మోదీ దోవల్‌కు సూచించినట్టు తెలుస్తోంది. ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవడం వల్ల ఎంతో లబ్ధ పొందుతాయనే విషయాన్ని గుర్తుచేశారు. ఈ క్రమంలో చైనా మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు వచ్చినా.. భారత్‌ మాత్రం సామరస్య పరిష్కారం కోసం ఒకింత మౌనాన్ని పాటించింది.

>
మరిన్ని వార్తలు