అక్రెడిటేషన్ బిల్లులో మార్పులు

18 Aug, 2013 23:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉన్నత విద్యాసంస్థలకు అక్రెడిటేషన్‌ను తప్పనిసరి చేసే ఉద్దేశంతో రూపొందించిన అక్రెడిటేషన్ బిల్లులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్వల్ప మార్పులు చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారికి జైలు శిక్ష విధించనున్నట్లు రూపొందించిన నిబంధనను బిల్లు నుంచి తొలగించింది.

‘ఉన్నత విద్యాసంస్థలకు జాతీయ అక్రెడిటేషన్ నియంత్రణ ప్రాధికార సంస్థ బిల్లు-2011’కు ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఆమోదం ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దీని ప్రకారం దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలకూ అక్రెడిటేషన్ సంస్థల నుంచి అక్రెడిటేషన్ తప్పనిసరి. తప్పనిసరి అక్రెడిటేషన్ నిబంధనను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.10 లక్షల జరిమానా లేదా ఏకకాలంలో రెండూ విధించనున్నట్లు బిల్లులోని క్లాజ్-41లో పేర్కొన్నారు.

అయితే, వివిధ భాగస్వాములు, పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయాల మేరకు ఈ నిబంధనలో మార్పు చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ బిల్లు పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే ఆమోదం పొందగలదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు