ఈ మహిళల జుట్టు ఇంత పొడవా!

5 Aug, 2016 19:27 IST|Sakshi
ఈ మహిళల జుట్టు ఇంత పొడవా!

ప్రపంచంలో ఎక్కడైనా ఆదివాసులు చిత్ర విచిత్ర వేషాధారణలో కనిపించడమే కాకుండా వేల సంవత్సరాలపాటు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారని మనకు తెలుసు. నాగరికత నీడ పడనంత కాలమే వారు అలా ఉంటారు. ఆధునిక సంస్కతి ప్రభావంతో వారి వేషధారణలోనూ, ఆచారాల్లో మార్పులు వస్తుంటాయి. కానీ చైనాలోని గ్వాగ్జీ రాష్ట్రంలో హాంగ్లో గ్రామానికి చెందిన యహో తెగకు చెందిన మహిళలపై మాత్రం ఆధునిక నాగరికత ప్రభావం కనిపించడం లేదు.

రెండు వేల ఏళ్ల నాటి ఈ తెగ మహిళలు జీవితంలో ఒక్కసారి మాత్రమే జట్టును కత్తిరించుకుంటారు. అదీ 18వ ఏట పెళ్లీడుకు వచ్చాకే. మళ్లీ జీవితంలో ఎన్నడూ కత్తిరించుకోరు. పెళ్లీడుకు వచ్చినప్పుడు కత్తిరించిన జుట్టుతోనే వారు పెళ్లయ్యాక హేర్‌ పిన్నులు తయారు చేసుకొని కొప్పులకు పెట్టుకుంటారు. ఆ హేర్‌ పిన్నులనుబట్టే వారికి పెళ్లయిందా, లేదా అన్న విషయం ఇతరులకు తెలుస్తుంది. ఎర్రటి ఎంబ్రాయిడరీగల నల్లటి దుస్తులు ధరించడం కూడా అక్కడి మహిళల ప్రత్యేకత. యూనిఫారమ్‌లాగా అందరు మహిళలు ఒకే రకం దుస్తులు ధరిస్తారు. వారు ఆరోగ్యంగా ఉంటారు. తమ సంపూర్ణ ఆరోగ్యానికి తాము పెంచుతున్న జుట్టే కారణమని వారు భావిస్తారు. వారు జుట్టు సంరక్షణ కోసం బియ్యం కడిగిన నీళ్లతో జుట్టును శుభ్రం చేసుకుంటారు.

హాంగ్లో గ్రామంలో 400 మంది ఈ తెగ ప్రజలు నివసిస్తుండగా, వారిలో 60 మంది మహిళలు ఉన్నారు. వారి జుట్టూ మూడు అడుగుల నుంచి ఆరు అడుగుల వరకు పొడుగు ఉంటుంది. వారిలో ఒక మహిళకు అందరికన్నా ఏడు అడుగుల పొడవు జుట్టు ఉంది. వారంతా తమ గ్రామానికి వచ్చే పర్యాటకులకు తమ జుట్టును చూపించి మురిసిపోతుంటారు. 60 మంది మహిళలో 18 ఏళ్ల ప్రాయానికి వచ్చిన ఓ యువతి మాత్రం తన జుట్టును కత్తిరించుకోవడం తనకు ఇష్టం లేదని, జుట్టును పెంచి ప్రపంచ రికార్డు సాధించాలన్నది తన ఆలోచన అని ఆమె చెప్పారు. అయితే తుది నిర్ణయం మాత్రం తన తాత చేతిలో ఉందని ఆమె అన్నారు. ప్రపంచంలో అతి పొడువు జుట్టుగల మహిళగా గిన్నీస్‌ రికార్డును సాధించినది కూడా చైనా మహిళే. జియా కియాపింగ్‌కు చెందిన చైనా మహిళ 18 అడుగుల ఐదు అంగుళాల జుట్టుతో వరల్డ్‌ రికార్డు నెలకొల్పారు.  

>
మరిన్ని వార్తలు