మళ్లీ సిండి‘కేటు’

28 Nov, 2013 01:09 IST|Sakshi
మళ్లీ సిండి‘కేటు’

* పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ మద్యం దిగుమతి
*రాష్ట్రంలో మైనస్‌లోకి ఏపీబీసీఎల్ మద్యం విక్రయాలు
*డీల్ కుదురుస్తున్న ప్రజా ప్రతినిధులు
*నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలకే ప్రమాదం
*ఏసీబీకి సిఫారసు చేస్తామంటూ అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టర్ హెచ్చరిక

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మైలవరం, అమలాపురం తరహా కల్తీ మద్యం సంఘటనలు మళ్లీ పునరావృతం కానున్నాయా? మద్యం తాగే అలవాటున్న ప్రజల ప్రాణాలు గాలిలో దీపమై ఊగుతున్నాయా? లిక్కర్ సిండికేటు ఒక్కసారిగా తెగబడిన తీరు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టర్ హెచ్చరికలు చూస్తుంటే ప్రజల ప్రాణాలకు మళ్లీ ముప్పు వచ్చిందని తెలుస్తోంది. ఏసీబీ దెబ్బకు 22 నెలల పాటు సెలైంట్‌గా ఉన్న లిక్కర్ సిండికేటు మళ్లీ జూలు విదిల్చడమే దీనికి కారణం. సిండికేటు దెబ్బతో సరిహద్దు రాష్ట్రాల నుంచి ఇబ్బడిముబ్బడిగా నకిలీ మద్యం పల్లెలకు చేరుతోంది.
 
 రెక్టిఫైడ్ స్పిరిట్‌తో విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారు చేసి గుప్పిస్తున్నారు. ఈ సిండికేటు దెబ్బకు రాష్ట్రంలో ఇంతకుముందెప్పుడూ లేనంతగా ప్రభుత్వ మద్యం అమ్మకాలు మైనస్‌లోకి పడిపోయాయి. పాత కమిషనర్ సమీర్‌శర్మ బదిలీపై వెళ్లడం, కొత్త కమిషనర్ ఇంకా శాఖపై పట్టు సాధించకపోవడంతో సిండికేట్లు మళ్లీ పాత జమానా మొదలు పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మధ్యవర్తులుగా ఉంటూ సిండికేట్ ‘డీల్’ కుదురుస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమ ఏరియాల్లోని దుకాణాల్లో వాటాలు తీసుకొని అక్రమ దందాకు తెరలేపారు. వీళ్లకు స్థానిక ఎక్సైజ్ అధికారుల వత్తాసు ఉందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటుకు సమాచారం అందింది.
 
 ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టర్ ఇటీవల అధికారుల సమావేశం నిర్వహించి ఎస్‌హెచ్‌వో స్థాయిలో ఏదో జరుగుతుందని, అధికారుల ప్రవర్తన మార్చుకోకపోతే ఏసీబీకి సిఫారసు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం హడావుడిగా జిల్లాలు తిరుగుతూ అధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించి పరిస్థితి సమీక్షిస్తున్నారు.
 
 పెరగాల్సిన విక్రయాలు తగ్గాయి!
 రాష్ట్రంలో నిరుపేద, సామాన్య ప్రజలు ఎక్కువగా తాగే చవక, మధ్యతరహా బ్రాండ్ల మద్యం విక్రయాలు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. పొరుగు రాష్ట్రాల నుంచి సుంకం లేని మద్యం (ఎన్డీపీఎల్) దొంగచాటుగా దిగుమతి చేసుకొని వైన్‌షాపుల్లో పెట్టి అమ్మడం వల్లనే ప్రభుత్వ మద్యం విక్రయాలు తగ్గుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.
 
 ఎన్డీపీఎల్ మద్యాన్ని కొంతమంది ముఠాగా ఏర్పడి పక్కరాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు తేల్చారు. అధికారుల అంచనా మేరకైనా, గత రికార్డులను బట్టి చూసినా మద్యం విక్రయాలు ఏటా కనీసం 10 శాతం చొప్పున పెరగాలి. అందుకు తగ్గట్లుగానే ఆంధ్రప్రదేశ్ బ్రివరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) వివిధ రకాల బ్రాండ్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. ఎక్సైజ్ అధికారుల అంచనాల్లో గత పదేళ్లుగా తేడా రాలేదు. కానీ గడచిన 18 రోజులలో ఏపీబీసీఎల్‌లో మద్యం అమ్మకాల రేటు గణనీయంగా పడిపోయింది. వాస్తవానికి ఈ ఏడాది మొదట్లో కూడా విక్రయాల రేటు బాగానే ఉంది.
 
 మద్యం ధరలు రెండుసార్లు పెరిగినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. పై లీన్ తుపాను, సమైక్య ఉద్యమం జరిగిన సమయంలో కూడా మద్యం విక్రయాల రేటు పెరుగుతూనే వచ్చింది. కానీ ఎకై ్సజ్ కమిషనర్ సమీర్‌శర్మ మారిన తరువాత ఈ నెల మొదటి వారం నుంచీ అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు ఊహించని విధంగా మైనస్‌లోకి పడిపోయాయి.  పొరుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో మద్యం విక్రయాలు భారీగా తగ్గడం, మిగిలిన జిల్లాల్లో పెద్దగా మార్పు లేకపోవడం ఎన్డీపీఎల్ మద్యం దిగుమతిని నిర్ధారిస్తోంది.
 
 ఆ నాలుగు రాష్ట్రాల నుంచీ దిగుమతి..
 శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒడిశా నుంచి.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తమిళనాడు నుంచి.. ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు మహారాష్ట్ర నుంచి.. పశ్చిమగోదావరి జిల్లాకు గోవా నుంచి అక్రమంగా ఎన్డీపీఎల్ మద్యం రవాణా అవుతున్నట్లు ఎక్సైజ్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల్లోని డిస్టిలరీల నుంచి వ్యాపారులు మద్యాన్ని కొనుగోలు చేసి ప్రత్యేకంగా డిజైన్ చేసిన లారీల ద్వారా ఇక్కడకు తరలిస్తున్నారు. మీడియం లిక్కర్‌ను కేసు (12 ఫుల్ బాటిల్స్) రూ.1,100 చొప్పున  కొనుగోలు చేసి రాష్ట్రంలో రూ.4,200 చొప్పున అమ్ముతున్నారు. రోజుకు కనీసం 5 నుంచి 7 లారీల మద్యం రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతున్నట్లు అంచనా. చౌక మద్యంతో ప్రజల ఆరోగ్యానికి హాని ఉన్నా ఎక్సైజ్ అధికారులు తేలుకుట్టిన దొంగల్లా చూస్తున్నారు.

మరిన్ని వార్తలు