సొంతమైనా... అద్దెకైనా భాగ్యనగరమే బెస్ట్..!

21 Dec, 2013 03:11 IST|Sakshi
సొంతమైనా... అద్దెకైనా భాగ్యనగరమే బెస్ట్..!

సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు కొనేందుకైనా, అద్దెకివ్వడానికైనా హైదరాబాద్ అత్యుత్తమ నగరం. ఆస్తిని కొనుగోలు చేయడానికైతే మాత్రం అహ్మదాబాద్‌ది రెండో స్థానం. అదే కేవలం ఇల్లు అద్దెకివ్వడానికే అయితే మాత్రం ఢిల్లీ చాలా బెటర్. ఇక ఇల్లు కొనేందుకైనా, అద్దెకిచ్చేందుకైనా అత్యంత ఖరీదైన నగరం మాత్రం ముంబై..’ ఇదీ... వ్యక్తిగత ఆర్థిక సేవల కంపెనీ అయిన అర్థయంత్ర.కామ్ వెల్లడించిన ఆసక్తికర అంశాలు. ఇల్లు కొనడం, అద్దెకివ్వడం అనే అంశాలపై అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పుణె వంటి ఎనిమిది నగరాల్లో సర్వే చేసి ‘బై వర్సెస్ రెంట్ రిపోర్ట్-2014’ సెకండ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. నివేదికలో హైదరాబాద్‌కు సంబంధించిన మరిన్ని విషయాలివీ...
 
 దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఫ్లాట్ల ధరలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేవు. ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే రెండేళ్లుగా ధరలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో వెయ్యి చ.అ.లకు రూ. 41.75 లక్షలు పలుకుతోంది. గతేడాది రూ. 37.64 లక్షలుగా ఉంది. అంటే ఏడాదిలో రూ. 4.11 లక్షలు పెరిగింది. రూ. 10 లక్షల నుంచి రూ. 11 లక్షల ఆదాయం గల వారు హైదరాబాద్‌లో తేలికగా ఇల్లు కొనుక్కోవచ్చు. కాకపోతే ఈఎంఐ భారం తగ్గించుకునేందుకు జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే చాలు.
 
 హైదరాబాద్‌లో సగ టు అద్దె ధర రూ. 12 వేలుగా ఉంది. అద్దె కోసం ఆస్తిని కొనాలనుకునేవారికి కూడా హైదరాబాదే మంచి ప్రాంతం. ఎందుకంటే నగరంలో ఈ ఏడాది అద్దె విలువలు 15 శాతం మేర పెరిగాయి. గతేడాది 11 శాతం మేర ఆస్తుల విలువలు వృద్ధి చెందాయి.
 
 మెరుగైన కార్పెట్ ఏరియా అందించడంలో కూడా హైదరాబాదే మెరుగైంది. ముంబై, ఢిల్లీలో ప్రతి ఏటా కార్పెట్ ఏరియా క్రమంగా తగ్గిపోతోంది. రూ. లక్ష పెట్టుబడికి హైదరాబాద్‌లో ఈ ఏడాది గరిష్టంగా 23.95 చ.అ. స్థలం కొనుగోలు చేయవచ్చు. ఇదే గతేడాది 26.57 చ.అ.లుగా ఉంది.
 
 అహ్మదాబాద్‌లో ఈ ఏడాది 20.18 చ.అ., పూణేలో గతేడాది 18.55 చ.అ., ఈ ఏడాది 23.39 చ.అ. స్థలం కొనుగోలు చేయవచ్చు. బెంగళూరులో గతేడాది 16.01 చ.అ., ఈ ఏడాది 18.39 చ.అ., కోల్‌కత్తాలో గతేడాది 15.69 చ.అ., ఈ ఏడాది 19.52 చ.అ., కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా చెన్నైలో గతేడాది 13.16 చ.అ., ఈ ఏడాది 13.96 చ.అ., ఢిల్లీలో గతేడాది 8.55 చ.అ., ఈ ఏడాది 9.19 చ.అ., ముంబైలో గతేడాది 7.50 చ.అ., ఈ ఏడాది 9.15 చ.అ. స్థలం కొనుగోలు చేయవచ్చని అర్థయంత్ర.కామ్ సర్వేలో తేలింది.
 
 ఇల్లు కొనేందుకు అహ్మదాబాద్ 2వ స్థానం, అద్దెకుండేందుకు మాత్రం 5వ స్థానంలో నిలిచింది. ఇల్లుకొనేందుకు బెంగళూరు 4వ స్థానం, అద్దెకుండేందుకు 3వ స్థానంలో ఉంది. ఇల్లు కొనేందుకైనా, అద్దెకివ్వడానికైనా అత్యంత ఖరీదైన నగరం ముంబై. ఢిల్లీ నగరం కేవలం అద్దెకుమాత్రమే అనువైందని సర్వేలో తేలింది.
 
 లాభనష్టాలు తెలుసుకోవచ్చు..
 ఇల్లు కొనడం లేదా అద్దెకివ్వడం వ్యక్తి ఆర్థిక అంశాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది. అద్దె విలువ, ఆస్తి ధర, స్థూల ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే సాగింది. బడ్జెట్‌కు అందుబాటులో ఉన్నదీ, లేనిదీ పరిశీలించుకున్నాకే ఇల్లు కొనుగోలు చేయడంలో నిర్ణయం తీసుకోవాలి. సర్వేలోని అన్ని వివరాలను నిశితంగా పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నప్పుడు మేలు జరుగుతుంది.
   - నితిన్ బీ వ్యాకరణం, అర్థయంత్ర ఫౌండర్, సీఈఓ

మరిన్ని వార్తలు