బోనమెత్తనున్న భాగ్యనగరం

9 Aug, 2015 06:50 IST|Sakshi
బోనమెత్తనున్న భాగ్యనగరం

* వైభవంగా లాల్‌దర్వాజ బోనాలు
* హాజరుకానున్న సీఎం అమ్మవారికి స్వర్ణ కిరీటం
* అక్కన్న, మాదన్న దేవాలయంలో ఘనంగా వేడుకలు

 
సాక్షి,హైదరాబాద్: బోనాల వేడుకలతో హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక వాతావ రణం నెలకొంది. ఆదివారం జరగనున్న ఉత్సవాలకు నగరంలోని అమ్మవార్ల ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. రంగు రంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే పాతబస్తీ ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రతి ఏటా కన్నుల పండువగా జరుగుతాయి. లాల్‌దర్వాజ సింహవాహిని కాళికాదేవి  ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దా రు. ఈ ఏడాది 72 తులాలతో రూపొందించిన బంగారు కిరీటాన్ని కాళికాదేవికి భక్తులు సమర్పించనున్నారు. సీఎం కేసీఆర్ లాల్‌దర్వాజ బోనాలకు హాజరుకానున్నారు. దేవాదాయ శాఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనుంది. నిజాం కాలం నుంచి ఈ దేవాలయంలో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.  
 
 అక్కన్న , మాదన్న ఆలయానికి కొత్త భవనం
 ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవాలయంగా పేరు ప్రఖ్యాతలున్న హరిబౌలి శ్రీ అక్కన్న, మాదన్న దేవాలయం కాంతులీనుతోంది. ఆలయానికి ఆనుకొని  ఈ ఏడాది  అతి పెద్ద సమావేశ మందిరాన్ని నిర్మించారు. ఈ సారి  ఈ నూతన  భవనం ప్రత్యేక ఆకర్షణ కానుంది. గోల్కొండ రాజు తానీషా మంత్రివర్గంలో కమాండర్ ఇన్ చీఫ్‌గా కొనసాగిన అక్కన్న, ప్రధాన మంత్రిగా పని చేసిన ఆయన సోదరుడు మాదన్న విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజూ గోల్కొండ కోటకు వెళ్లే ముందు హరిబౌలిలోని అమ్మవారికి పూజలు నిర్వహించేవారు. వారి మరణానంతరం 1948లో ఆర్యసమాజ్ నాయకులు ఈ ఆలయాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చారు. ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించడం ప్రారంభించారు. పాతబస్తీలోని అన్ని ఆలయాలతో పాటు నగరమంతటా అమ్మవార్ల ఆలయాలు ఆదివారం నాటి వేడుకలకు అందంగా ముస్తాబయ్యాయి. నేడు నగరంలో జరగనున్న బోనాల వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు