వీసాల్లో హైదరాబాదే ముందు

8 Oct, 2015 09:09 IST|Sakshi
వీసాల్లో హైదరాబాదే ముందు

హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్

సాక్షి, హైదరాబాద్: వీసా కోసం దరఖాస్తు చేసుకోవడంలో దేశంలో కెల్లా హైదరాబాదే మొదటి స్థానంలో ఉందని హైదరాబాద్ యూఎస్ కాన్సూల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన యూఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (యూఎస్‌ఐఈఎఫ్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో యూనివర్సిటీ ఫెయిర్ నిర్వహించారు. అమెరికాకు చెందిన దాదాపు 30 యూనివర్సిటీలు ఫెయిర్‌లో పాల్గొన్నాయి. వర్సిటీల ప్రతినిధులతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా కలుసుకునే అవకాశాన్ని కల్పించారు.
 
 ప్రవేశాలు, వీసా దరఖాస్తుల ప్రక్రియ, ఆఫర్ చేస్తున్న ప్రోగ్రాంలు, ఐఈఎల్‌టీఎస్, టోఫెల్, జీఆర్‌జీ స్కోరింగ్ తదితర అంశాలపై విద్యార్థులు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముల్లిన్స్ మాట్లాడుతూ యూజీ, గ్రాడ్యుయేట్, మాస్టర్స్‌కు అమెరికా స్వర్గధామమని చెప్పారు. అక్కడి ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలు, అత్యుత్తమ బోధన, పరిశోధనలతో విద్యార్థులకు మంచి భవిష్యత్ లభిస్తోందని తెలిపారు.

2014-15 విద్యా సంవత్సరంలో అమెరికాలో 1.13 లక్షల మంది ఇండియా విద్యార్థులు ఉండగా... ఈ ఏడాది ఆగస్టు నాటికి 1.49 లక్షలకు చేరుకుందని పేర్కొన్నారు. ఏడాది కాలంలోనే 32 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. గతంతో పోల్చుకుంటే హైదరాబాద్ నుంచి వీసాకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 51 శాతం ఎగబాకిందన్నారు.

మరిన్ని వార్తలు