ఐటీ ఎగుమతులు రూ.75 వేల కోట్లు

16 Mar, 2017 02:24 IST|Sakshi
ఐటీ ఎగుమతులు రూ.75 వేల కోట్లు

మండలి ప్రశ్నోత్తరాల్లో ఐటీ మంత్రి కేటీఆర్‌
ప్రత్యక్షంగా 4 లక్షల మందికి ఉపాధి..
ఐటీలో బెంగళూరు తర్వాత హెదరాబాదేనని వెల్లడి
ఈనెల 20 నాటికి అన్ని స్కూళ్లకు పుస్తకాలు: కడియం
గ్రామజ్యోతి.. ఉన్నట్టా? లేనట్టా?: షబ్బీర్‌అలీ


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం నుంచి ప్రతీ ఏటా రూ.75 వేల కోట్ల ఐటీ ఎగుమతులు జరుగు తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. బుధవారం శాసన మండలిలో ప్రశోత్తరాల సమయంలో çసభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్‌.రామచందర్‌ రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ జవాబిచ్చారు. ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత దేశంలో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఐటీలో ప్రత్యక్షంగా 4 లక్షల మంది, పరోక్షంగా అంతకు రెండున్నర రెట్ల మంది ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఐటీ రంగంలో 31, పారిశ్రామిక రంగంలో 175 ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. కరీంనగర్, వరంగల్, జనగామ, హుజూరా బాద్, జడ్చర్లలో ఐటీ పార్కులు ప్రారంభి స్తామని వెల్లడించారు.

పారిశ్రామిక విస్తరణలో భాగంగా 14 ప్రాముఖ్య రంగాలను ఎంచుకు న్నామని పేర్కొన్నారు. వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. సత్తుపల్లిలో ఫుడ్‌ పార్కును, సిద్దిపేట, ఖమ్మంలలో గ్రానైట్‌ పార్కుల ఏర్పా టు యోచన ఉందని తెలిపారు. ఐటీఐఆర్‌ వచ్చినా రాకపోయినా ఐటీలో రాష్ట్రం తన దూకుడు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోని టాప్‌ 5 కంపెనీల్లో నాలుగు కంపెనీలు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయన్నారు.

యాపిల్‌ కంపెనీ మొదటి దశలో నెలకు ఐదు నుంచి 10 వేల ఫోన్ల తయారీపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉందని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌అలీ చెప్పగా.. అది వాస్తవమేనన్న కేటీఆర్‌.. నగరాల్లో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం ఎస్సీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.154.15 కోట్లు, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.95.51 కోట్లు విడుదల చేసిందన్నారు.

1.74 కోట్ల పాఠ్య పుస్తకాల పంపిణీ: కడియం
ఈనెల 20వ తేదీ నాటికి అన్ని పాఠశాలలకు 1.74 కోట్ల పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సభ్యులు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌ అడిగిన ప్రశ్నకు కడియం సమాధానం ఇస్తూ.. ఒకవేళ ఏదైనా పాఠశాలకు అందలేదని తెలిస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800–425–7462 కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లు ఎల్‌కేజీ నుంచి 5వ తేదీ వరకే సొంతంగా ప్రచురించుకోవచ్చని చెప్పామని, 6 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే వాడాలని పేర్కొన్నట్లు వివరిం చారు.

ప్రైవేటు స్కూళ్లు పుస్తకాల రూపంలో రూ.200 కోట్లు లూటీ చేస్తున్నా యని కాంగ్రెస్‌ సభ్యుడు పొంగులేటి ఆరోపిం చారు. వెనుకబడిన తరగతుల కోసం 2017–18 విద్యా సంవత్సరం నుంచి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చామని, అయితే అర్హతలను సవరించాలని అభ్యర్థులు కోరడంతో.. సవరింపునకు సీఎం ఆదేశించారన్నారు. శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తారా అని షబ్బీర్‌ అలీ ప్రశ్నించగా.. త్వరలో చేపడతామని సమాధానమిచ్చారు.

గ్రామజ్యోతిపై రసాభాస
మన ఊరు మన ప్రణాళికలో భాగంగా ప్రారంభించిన గ్రామజ్యోతి కార్య క్రమంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. గ్రామజ్యోతి కార్యక్రమంపై ఘనంగా ప్రచారం చేసుకు న్నారని.. అది అసలు ఉన్నట్టా, లేనట్టా అని షబ్బీర్‌అలీ నిలదీశారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ గ్రామజ్యోతి కిందకే వస్తాయ ని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జవాబి చ్చారు. గ్రామజ్యోతి కింద 2015–16లో రూ.450 కోట్లతో 43,674 పనులు, 2016–17లో రూ.492.69 కోట్లతో 42,757 పనులు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో 8,227 గ్రామ పంచాయతీలను బీటీ రోడ్లతో అనుసంధానించామని చెప్పారు.

మరిన్ని వార్తలు