రెండేళ్లు హైదరాబాద్ యూటీ?

26 Nov, 2013 01:28 IST|Sakshi
రెండేళ్లు హైదరాబాద్ యూటీ?

సాధ్యాసాధ్యాలపై సోనియా ఆరా
హైదరాబాద్‌పై జీవోఎం సభ్యులతో మేడమ్ అత్యవసర సమావేశం
అలాగైతే సీమాంధ్ర ఎమ్మెల్యేలు సహకరిస్తారన్న కేంద్ర మంత్రులు
28 నాటి కేబినెట్ భేటీకల్లా తెలంగాణ బిల్లు సిద్ధం చేయాలని ఆదేశం
యూటీకి తాను సుముఖమేనన్న కిరణ్!
విభజనకు సహకరిస్తాం.. సీఎంనూ ఒప్పిస్తాం: శీలం
రేపు సాయంత్రం 4.30కు భేటీ కానున్న జీవోఎం
 
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ను తాత్కాలిక కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధినంతటినీ రెండేళ్ల పాటు యూటీ చేసే విషయంపై తలెత్తే ఇబ్బందులేమిటో తెలుసుకుని, వాటిని అధిగమించేందుకు తగిన ప్రతిపాదనలు చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించారు. సోమవారం సాయంత్రం జీవోఎం సభ్యులతో ఆమె అత్యవసరంగా సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లు, నివేదికలోని అంశాలపై గంటకు పైగా చర్చించారు. జీవోఎం సారథి సుశీల్‌కుమార్ షిండే, సభ్యులు పి.చిదంబరం, ఏకే ఆంటోనీ, జైరాం రమేశ్‌లతో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా భేటీలో పాల్గొన్నారు. ఏఐసీసీ వర్గాల సమాచారం మేరకు.. సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రతిపాదనల అమలు సాధ్యాసాధ్యాలపై తీవ్రంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు పూర్తిగా సహక రిస్తామని, అయితే హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల భద్రత కోసం దాన్ని యూటీ చేయాలని ఇటీవల సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇటీవల జీవోఎం సభ్యులతోపాటు హైకమాండ్ పెద్దలను విడివిడిగా కలిసి ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే.
 
 సీమాంధ్రలో వేగంగా కొత్త రాజధాని నిర్మించుకోవాలంటే కనీసం రెండేళ్లయినా పడుతుందని, అప్పటి వరకైనా హైదరాబాద్‌ను యూటీ చేస్తే చాల ని  కోరారు. తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే అసెంబ్లీలో విభజన బిల్లుకు ఇబ్బంది లేకుండా ఉండేలా సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఒప్పిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇదే విషయంపై తాము ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోనూ మాట్లాడామని, ఆయన కూడా సానుకూలంగా ఉన్నారని  జీవోఎం సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం ఈ విషయాన్ని సోనియా దృష్టికి కూడా తీసుకెళ్లారు. యూటీ సాధ్యాసాధ్యాలను పరిశీలించడమే గాక విభజనపై ఆంటోనీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని, నవంబర్ 28న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశానికి నివేదికను సమర్పించాలని సోనియా ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. దీంతో జీవోఎం సభ్యులంతా బుధవారం సాయంత్రం 4.30 గంటలకు నార్త్ బ్లాక్‌లో సమావేశమై హైదరాబాద్ యూటీ, ఆంటోనీ నివేదిక సిఫార్సుల అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించి తమ నివేదికను ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారు.
 
 రాష్ట్ర విభజనను బయటికి మాత్రం వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, లోలోన మాత్రం ఆ విషయంలో అధిష్టానానికి తన పూర్తి సహకారాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే విభజనకు తనకెలాంటి అభ్యంతరమూ లేదని ఆయన స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. సీమాంధ్రకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు సీఎంతో ఫోన్‌లో మాట్లాడుతూ యూటీ ప్రతిపాదన తెచ్చినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే రాష్ర్ట విభజనకు సహకరిస్తామని శీలం సోమవారం సాయంత్రం కొన్ని టీవీ చానళ్లతో మాట్లాడుతూ తెలిపారు. ‘‘సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి కనీసం రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. అందుకే అప్పటిదాకా హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నాం. మా ప్రతిపాదనకు అంగీకరిస్తే విభజన బిల్లుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలందరినీ ఒప్పిస్తాం’’ అని ఆయన తెలిపారు. అంటే కిరణ్‌ను కూడా విభజనకు ఒప్పిస్తారా అని ప్రశ్నించగా, అందరిలో సీఎం కూడా ఒకరని బదులిచ్చారు.
 
 కేబినెట్‌లో చర్చకు రాని తెలంగాణ
 ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ అంశం చర్చకు రాలేదని తెలుస్తోంది. సుమారు 45 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో ఆర్థిక, వాణిజ్య వ్యవహారాలపైనే చర్చ జరిగినట్టు సమాచారం.
 
 నేడు షిండేతో మర్రి బృందం భేటీ
 విభజన నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని డిమాండ్ చేస్తున్న టీ కాంగ్రెస్ నేతలు మంగళవారం షిండేను కలవనున్నారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నేతల బృందం ఉదయం 10.30కు షిండేను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేయనుంది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను ప్రస్తుతమున్న 119 నుంచి 153కు పెంచాలని అందులో పేర్కొనున్నారు.
 

మరిన్ని వార్తలు