అందుకే ప్రచారం కూడా చేయలేదు: వెంకయ్య

5 Aug, 2017 10:22 IST|Sakshi
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌: పార్లమెంట్‌కు వస్తోన్న ప్రధాని మోదీ, ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య.

న్యూఢిల్లీ: భారత 13వ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం శనివారం ఉదయం 10 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు పార్లమెంట్‌ హాలుకు చేరుకున్నారు. సందడి వాతావరణంలో ఓటింగ్‌ ప్రక్రియ మొదలైంది. ఎన్డీఏ అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు తన గెలుపుపై దీమా వ్యక్తం చేశారు. అందరికంటే ముందే పార్లమెంట్‌కు చేరుకున్న ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు.

తాను పార్టీలకు అతీతుడినన్న వెంకయ్య.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ వ్యక్తిమీదో లేదా పార్టీ మీదో పోటీ చేయడంలేదని అన్నారు. దేశంలోని మెజారిటీ పార్టీలు తన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నాయని గుర్తుచేశారు. ‘ పార్లమెంట్‌లో నేను ప్రతిఒక్కరికీ తెలిసినవాడినే. అందుకే ప్రచారం కూడా చేయలేదు. అయితే, మద్దతు కోరుతూ ప్రతిఒక్కరికీ మర్యాదపూర్వకంగా లేఖలు రాశాను. వాళ్ల ప్రతిస్పందనను బట్టి గెలుస్తాననే నమ్మకం ఉంది’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు.