పార్టీలోనే ఉంటాను కానీ పోటీ చేయను!

14 Jun, 2015 14:43 IST|Sakshi
పార్టీలోనే ఉంటాను కానీ పోటీ చేయను!

హైదరాబాద్: వరంగల్ లోక్సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఈ ఉప ఎన్నికను పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఆ పార్టీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. అందులోభాగంగా  పార్టీ సీనియర్లు పలువురు నేతలను సంప్రదిస్తున్నారు. అ క్రమంలో  ఈ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ జి. వివేక్ను సంప్రదించారు.

అయితే పార్టీలోనే ఉంటాను కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేయనంటూ ఆయన సున్నితంగా తిరస్కరించారని సమాచారం. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ కేంద్ర మంత్రి ఎస్ రాజయ్యను ఈ ఉప ఎన్నికల బరిలో దింపాలని కాంగ్రెస్ నేతలు యోచనలో ఉన్నట్లు తెలిసింది.

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... కడియం శ్రీహరిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించారు. దాంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

దీంతో వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలనే కాదు వరంగల్ లోక్సభను కూడా కైవసం చేసుకుంటామనే ధీమాతో  కేసీఆర్ సర్కార్ ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన జి.వివేక్... టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు