చంద్రబాబుతో నాకు పనిలేదు: వెంకయ్య

7 Feb, 2017 18:43 IST|Sakshi
చంద్రబాబుతో నాకు పనిలేదు: వెంకయ్య

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా అనే వాళ్లకు ప్రత్యేకహోదా అంటే ఏమీ తెలియదని కేంద్ర పట్టణాభివృద్ది, సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తాను ఆ రోజు పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు ఆ రోజు ఎవరూ మాట్లాడలేదని ఆయన చెప్పారు. హోదాకు అవసరమయ్యే లక్షణాలు రాష్ట్రంలో లేనప్పటికీ హైదరాబాద్ లేనందువల్ల ఆదాయం తగ్గుతుందనే ఉద్దేశంతో తానే గట్టిగా వాదించానని చెప్పారు. దానికి అప్పటి ప్రభుత్వం చట్టబద్దత కల్పించలేదన్నారు. కాని ఎందుకు అడిగావు, గొంతు చించుకున్నావు అని అడగడం సరైంది కాదని అన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికీ, మామూలు రాష్ట్రానికి తేడా పాటించకూడదని నిర్ణయించిందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా ఉన్నందువల్ల  రు. 3 వేల నుంచి 4 వేల కోట్ల మేరకు ఆదాయం లభిస్తుందని, అంత మేరకు ఇవ్వడమే కాక, రూ. 3 లక్షల 50 వేల కోట్లమేరకు పెట్టుబడులతో సంస్థలు వచ్చేందుకు తాము కృషి చేశామన్నారు.

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి స్వచ్చందంగా భూములు ఇచ్చిన రైతుల సమస్యలను పట్టించుకుని ఆదాయపన్నులో మినహాయింపు ఇచ్చే విషయంలో అండదండగా నిలిచిన వెంకయ్య నాయుడుకు రాజధాని రైతుల సమాఖ్య తరఫున ఢిల్లీకి వచ్చిన దాదాపు వంది మంది రైతు ప్రతినిధులు మంగళవారం ఉదయం ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... రాజధాని నిర్మాణానికి మొదటి నుంచీ కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకరాన్ని అందిస్తోందన్నారు. రాజధాని అమరావతిలో రావడమే అక్కడి రైతుల అదృష్టమని అన్నారు. రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ది జరగాలన్నదని తన అభిప్రాయమని, ముఖ్యమంత్రి కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి అడ్డంకులు లేవన్నారు.

తాను ఎన్నికల్లో నిలబడనని.. ఓటు అడగనని, చంద్రబాబుతో తనకు ఏ పనీ లేదని వెంకయ్య స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వాడిగా పనిగట్టుకుని రాష్ట్రానికి మేలు జరిగేలా చూస్తానని, తర్వాత తెలుగువాడిలా ఆలోచిస్తానని.. తర్వాత దేశం గురించి యోచిస్తానని చెప్పారు. నరేంద్ర మోదీ, చంద్రబాబులను ప్రశంసించడాన్ని కూడా కొందరు విమర్శిస్తున్నారని వాపోయారు. మోదీ తనకు రాజ్యసభ సీటు ఇచ్చినందుకు ప్రశంసించారని చౌకబారు ఆరోపణలు చేసేవారికి తానే పార్టీ అధ్యక్షుడుగా అనేకమందికి రాజ్యసభ సీట్లు ఇచ్చి పెద్దల సభకు పంపించానన్న విషయం తెలియాలని అన్నారు.

మరిన్ని వార్తలు