మహిళగా మారాక.. నాపై అత్యాచారం

8 Jan, 2017 16:10 IST|Sakshi
మహిళగా మారాక.. నాపై అత్యాచారం
అబ్బాయిగా ఉన్నన్నాళ్లు తనకు బాగానే ఉండేదని, కానీ అమ్మాయిగా మారిన తర్వాత తనపై అత్యాచారం జరిగిందని లండన్‌కు చెందిన లారెన్ హారీస్ చెప్పారు. తొలుత అబ్బాయిగా ఉన్నప్పుడు 12 ఏళ్ల వయసులోనే పురాతన వస్తువుల నిపుణుడిగా లారెన్ ఉండేవాడు. మంచి సూటు వేసుకుని, టై కట్టుకుని హుందాగా కనిపించేవాడు. అయితే, ఒంట్లో ఆడ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో స్కూల్లో తరచు అవమానాలకు గురయ్యేవాడు. ఫలితంగా డిప్రెషన్, అగోరాఫోబియా.. ఇవన్నీ రావడంతో పాటు మూడుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. చిట్టచివరకు 2002లో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోయాడు. 
 
అయితే.. అప్పటివరకు ఒక రకం కష్టాలైతే ఆ తర్వాత మరో రకం కస్టాలు మొదలయ్యాయి. లండన్‌లోని ఓ హోటల్లో ఉండగా దారుణంగా అత్యాచారం జరగడంతో, ఆస్పత్రిలో చికిత్స కూడా పొందాల్సి వచ్చింది. ఇప్పుడు తాను పరిపూర్ణ మహిళగా ఉన్నానని, ట్రాన్స్‌జెండర్ టీవీ పర్సనాలిటీగా ఉండటంతో పాటు గాయనిగా కూడా పేరు సంపాదించానని చెప్పింది. చాలా కాలం పాటు అసాధారణ జీవితం గడిపానని, ఇప్పుడు మహిళగా మారిన తర్వాత భద్రత లేకుండా పోయిందని లారెన్ హారీస్ అంటోంది. 
 
ఎనిమిదేళ్ల వయసులో తాను తన సోదరులతో పాటు ఎదగాల్సినంతగా ఎదగకపోవడంతో తన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లిందని, తీరా చూస్తే అప్పుడు అసలు విషయం తెలిసిందని హారీస్ వివరించింది. తన సోదరులు ట్రక్కులు, ట్రాన్స్‌ఫార్మర్ లాంటి బొమ్మలతో ఆడుకుంటుంటే తాను మాత్రం చిన్న గుర్రప్పిల్ల బొమ్మ, చైనా బొమ్మలతో ఆడుకునేదాన్నని తెలిపింది. వయసు పెరిగే కొద్దీ సమస్య తీవ్రమైందని, 16 ఏళ్ల వయసు వచ్చాక కూడా తానేంటో, ఏం కావాలనుకుంటున్నానో అర్థమయ్యేది కాదని చెప్పింది. ఎట్టకేలకు మహిళగా మారిన తర్వాత ఆ సమస్యలన్నీ పోయినా.. ఇప్పుడు భద్రత పెద్ద సమస్యగా మారిందని వాపోయింది. 
మరిన్ని వార్తలు