కేజ్రీవాల్‌ నిరుపేద సీఎం

5 Apr, 2017 02:38 IST|Sakshi
కేజ్రీవాల్‌ నిరుపేద సీఎం

ఫ్రీగా వాదిస్తా: రాం జెఠ్మలానీ

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నిరుపేద సీఎం అని, ఎటువం టి ఫీజు తీసుకోకుండా ఆయన తరఫున కోర్టులో వాదించేందుకు తాను సిద్ధమని ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ చెప్పారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో వాదించడానికి జెఠ్మలానీని కేజ్రీవాల్‌ నియమించుకోవడం తెలిసిందే. ఇందు కోసం రూ.3.4 కోట్ల ఫీజుకు సంబంధించిన బిల్లులను జెఠ్మలానీ పంపారు. ఈ ఫీజును ఢిల్లీ ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేందుకు యత్నించడం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో జెఠ్మలానీ స్పందించారు. ఢిల్లీ సీఎం తన ఫీజును చెల్లించలేని స్థితిలో ఉన్నట్లయితే తాను ఉచితంగా వాదిస్తానని చెప్పారు. ‘‘ఫీజు చెల్లించక పోయినా కేజ్రీవాల్‌ తరఫున వాదిస్తా.

కానీ ఆయన బిల్లులు పంపమని కోరడంతో పంపాను. ఒకవేళ ప్రభుత్వం ఆయనకు మద్దతుగా నిలవకున్నా నేను నిలుస్తా. అవసరమైతే ఆయన జీవనానికి అవస రమైన సొమ్మును కూడా ఇస్తా. ఎందుకంటే అరుణ్‌జైట్లీతో పోలిస్తే కేజ్రీవాల్‌ అత్యంత నిజాయితీపరుడు. పేదవాడు’’ అని జెఠ్మలానీ అన్నారు. ఈ వివాదంపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ ఇది తన వ్యక్తిగత కేసు కాదనీ, తన సొంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు