నా కథ... నేనే రాస్తా: సోనియా

1 Aug, 2014 02:26 IST|Sakshi
నా కథ... నేనే రాస్తా: సోనియా

న్యూఢిల్లీ: విదేశాంగశాఖ మాజీ మంత్రి, తమ కుటుంబానికి ఒకప్పటి సన్నిహితుడైన నట్వర్‌సింగ్ తన జీవితకథపై రాసిన పుస్తకం (వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్: యాన్ ఆటోబయోగ్రఫీ)లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా ప్రతిస్పందించారు. రాహుల్‌గాంధీ వారించటం వల్లే 2004లో సోనియాగాంధీ ప్రధాని పదవిని చేపట్టలేదంటూ నట్వర్‌సింగ్ వెల్లడించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజాలను తెలిపేందుకు త్వరలో తాను ఓ పుస్తకం రాయనున్నట్లు సోనియాగాంధీ ప్రకటించారు. గురువారం పార్లమెంట్ భవనం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘నేనే సొంతంగా ఓ పుస్తకం రాస్తా. అప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. నిజం తెలియాలంటే ఏకైక మార్గం నేను రాయటమే. దీని గురించి తీవ్రంగా పరిశీలిస్తున్నా’ అని సోనియా పేర్కొన్నారు. నట్వర్‌సింగ్ వ్యాఖ్యలు తనను బాధించలేవని... ఇంతకు మించిన దారుణాలను తాను చూశానన్నారు. తన భర్త రాజీవ్‌గాంధీ హత్యకు గురి కావటం, అత్త ఇందిరాగాంధీ దేహం తూటాలతో ఛిద్రం కావటం లాంటి విషాదాలతో పోలిస్తే ఇలాంటివి తనను బాధించలేవన్నారు.
 
 సోనియా విదేశీయతను లేవనెత్తిన నట్వర్
 
 తాను రాసిన పుస్తకంపై నట్వర్‌సింగ్ గురువారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని అంశాలను బయటపెట్టారు. ముఖ్యంగా తనపట్ల సోనియా గాంధీ వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. 45 ఏళ్లపాటు నెహ్రూ కుటుంబానికి విధేయుడిగా ఉన్న తన వంటి వ్యక్తిని భారతీయులెవరూ అంతగా అవమానించరని పరోక్షంగా సోనియా ఇటలీ విదేశీయతను ప్రస్తావించారు. భారత్‌లోనైతే ఎన్నటికీ అలా జరగదన్నారు. కానీ సోనియాలో నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడమనే రెండో భాగం ఉందన్నారు. నెహ్రూ, రాజీవ్, ఇందిరా గాంధీల ప్రవర్తన ఎప్పుడూ అలా ఉండేది కాదన్నారు. సోనియా ఎప్పుడూ రాజీవ్ భార్యలాగా ప్రవర్తించలేదని దుయ్యబట్టారు. మరోవైపు 1987లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఎవరినీ సంప్రదించకుండానే శ్రీలంకకు భారత శాంతిపరరక్షక దళాలను పంపారన్నారు. శ్రీలంక విషయంలో రాజీవ్ అనుసరించిన విదేశాంగ విధానమే చివరకు ఆయన హత్యకు దారితీసిందని చెప్పారు. పుస్తకాల మార్కెటింగ్ కోసమే: మన్మోహన్
 
 
 నట్వర్‌సింగ్ కేవలం ఆయన పుస్తకానికి ప్రచారం కోసమే ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నారని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ విమర్శించారు. తాను ప్రధానిగా ఉండగా ఫైళ్లు సోనియాగాంధీ ఆమోదం కోసం ఆమె ఇంటికి వెళ్లేవన్న ఆరోపణలను ఖండించారు. తనవద్ద మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌బారు సైతం ఆయన రాసిన పుస్తకానికి ప్రచారం కోసం తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. ‘వారు తమ ఉత్పత్తులను విక్రయించుకోవటానికి ఎంచుకున్న మార్గం ఇది’ అని మన్మోహన్ వ్యాఖ్యానించారు.
 
 వాస్తవాల వక్రీకరణ: నట్వర్‌సింగ్ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కాంగ్రెస్ నుంచి బహిష్కరించటంతో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారని గుర్తు చేసింది. నట్వర్‌సింగ్ తనయుడు రాజస్థాన్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వ్యహరిస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. నట్వర్‌సింగ్‌పై పరువు నష్టం దావా వేసే అంశాన్ని ఇంకా నిర్ణయించలేదన్నారు. ప్రధాని కార్యాలయం నుంచి ఫైళ్లు సోనియా నివాసానికి ఆమోదం కోసం వెళ్లేవన్న ఆరోపణలను రాజ్యసభలో విపక్షనేత గులాం నబీ ఆజాద్ ఖండించారు.

మరిన్ని వార్తలు