రేపటి రోజున నేనే మంత్రిని కదా...!!

9 Aug, 2015 02:09 IST|Sakshi
రేపటి రోజున నేనే మంత్రిని కదా...!!

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఉంది తాజాగా ఎన్నికైన ఓ ఎమ్మెల్సీ గారి వ్యవహారం. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఆయన పెద్దల సభకు ఎంపికయ్యారు. తన సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ లేరు. దీంతో తప్పకుండా తనకు మంత్రి పదవి ఖాయమని సదరు ఎమ్మెల్సీ గారు అపుడే ఒక నిర్ణయానికి వచ్చారు.  ఒకవేళ తాను మంత్రి అయితే ఏ శాఖను అప్పగిస్తారో అపుడే ఆయన ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ శాఖలో ఏఏ అధికారులను ఎక్కడెక్కడ నియమించాలో ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారికి సూచిస్తున్నారు. తన ఎమ్మెల్సీ లెటర్ హెడ్‌పై అందుకు అనుగుణంగా సిఫారసు లేఖలు కూడా ఇచ్చేస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తనకు కేటాయిస్తారని భావిస్తున్న శాఖలో బాధ్యతలు చక్కగా నిర్వహించుకునేందుకు ఆ ఎమ్మెల్సీ గారు ఇప్పటి నుంచే మార్గం సుగమం చేసుకుంటున్నారు.

అందులో భాగంగా ఇటీవల ఒక మంత్రి దగ్గరకు వచ్చిన ఆ ఎమ్మెల్సీ  గారు మీరు ప్రస్తుతం చూస్తున్న శాఖలోని ఫలానా కార్పొరేషన్‌కు ఫలానా అధికారిని నియమించండి, ఫలానా శాఖకు ఫలానా కమిషనర్‌ను నియమించండి అని సూచించారు. ఇపుడున్న అధికారులు బాగానే పనిచేస్తున్నారు కదా అని సదరు మంత్రి అమాయకంగా ఎమ్మెల్సీ గారిని ప్రశ్నిస్తే రేపు మంత్రివర్గ విస్తరణలో మీరు చూసే శాఖను  నాకే కేటాయిస్తారు కదా, ఆ శాఖను బాధ్యతలు చేపట్టిన వెంటనే చక్కదిద్దాలంటే కష్టం, అందుకే ఇప్పటి నుంచే నాకు అనుకూలమైన అధికారులను నియమింప చేసుకుని పర్యవేక్షిస్తుంటే అపుడు పని సులువవుతుందని సెలవిచ్చారట.
 
 దీంతో ఆశ్చర్యపోయిన మంత్రి గారు వెంటనే తేరుకుని అన్నా మీరు పార్టీకోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు, మీరు అడిగిన ఆ పని చేయలేనా అని చెప్పి అందుకు అనుగుణంగా అప్పటికపుడు  ఓ లేఖను తయారు చేయించి అందులో ఫలానా ఎమ్మెల్సీ గారి సిఫారసు మేరకు ఈ అధికారులను పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా నియమించండి అని పేర్కొన్నారు. తన లేఖతో పాటు ఎమ్మెల్సీ గారు రాసి ఇచ్చిన సిఫారసు లేఖను సీఎంతో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు కూడా పంపించి హమ్మా మీరు మంత్రి కాక ముందే నా శాఖలో వేలు పెడతానంటే కుట్టకుండా ఊరుకుంటానా? అందుకే సీఎంకు మీ లేఖను పంపాను అని సంతోషపడుతున్నాడట.

మరిన్ని వార్తలు