మీరు చెల్లిస్తే మాకు ఓకే

18 Jun, 2014 01:23 IST|Sakshi
మీరు చెల్లిస్తే మాకు ఓకే

రుణ మాఫీపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆర్‌బీఐ స్పష్టీకరణ
బ్యాంకులకు ఒకేసారి నగదు చెల్లించాలి
అలా చెల్లిస్తేనే రైతులకు తిరిగి రుణాలను మంజూరు చేయగలం
బాండ్లు, వాయిదాల పద్ధతి కుదరదు
దాని వల్ల అన్నదాతలకు రుణాలివ్వడానికి బ్యాంకుల వద్ద నగదు ఉండదని వెల్లడి
ఈ మేరకు ఇద్దరు సీఎస్‌లకు లేఖలు రాసిన ఆర్‌బీఐ
 
 సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీపై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టతనిచ్చింది. రైతులు చెల్లించాల్సిన రుణాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రూపంలో బ్యాంకులకు చెల్లిస్తే తమకెలాంటి అభ్యంతరంలేదని స్పష్టం చేసింది. అలా కాకుండా బాండ్లు జారీ చేస్తాం, వాయిదా పద్ధతిలో చెల్లిస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వారం రోజుల కిందట లేఖలు రాసింది.
 
 తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాలను పత్రికల్లో వార్తల ద్వారా తెలుసుకున్న ఆర్‌బీఐ ఉన్నతాధికారులు తమంతట తాముగా స్పందించారు. ఆ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌బీఐ లేఖలు రాసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల రుణాలు మాఫీ చేసిన సమయంలో ఆ మొత్తాన్ని నగదు రూపంలో బ్యాంకులకు చెల్లించిందని ఆ లేఖల్లో ప్రస్తావించింది.
 
 

ఇప్పుడు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రైతులు చెల్లించాల్సిన రుణాల మొత్తాన్ని బ్యాంకులకు జమ చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం ఉండదని స్పష్టం చేసింది. అలా చెల్లిస్తేనే బ్యాంకులు తిరిగి రైతులకు రుణాలను మంజూరు చేయగలవని... వాయిదాలు, బాండ్లు అంటే రైతులకు కొత్త రుణాలు మంజూరుకు బ్యాంకుల వద్ద నగదు ఉండదని పేర్కొంది. రైతుల రుణమాఫీకి ప్రాతిపదిక అనేది లేకపోతే బ్యాంకుల ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుందని ఆ లేఖల్లో ఆర్‌బీఐ పేర్కొంది. రిజర్వు బ్యాంకు తన విధానాలను ప్రకటిస్తూనే నగదు రూపంలో ఆయా ప్రభుత్వాలు బ్యాంకులకు చెల్లించేట్లయితే తమకే అభ్యంతరం లేదని స్పష్టపరచడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది.
 
 రిజర్వుబ్యాంకు విధానాలు, నిబంధనలు కొత్తగా వచ్చినవి కాకపోవడం, తాము ఎన్నికల హామీ ఇచ్చేటప్పటికే ఈ విధనాలు అమల్లో ఉండటంతో ఇప్పుడు రిజర్వు బ్యాంకు వైఖరిని తప్పుపట్టే పరిస్థితి లేదు. ఆర్‌బీఐ చెబుతున్నట్టుగా నగదు చెల్లించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను పరిష్కరించాలని స్పష్టమవడంతో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే, ఏ విధంగా సమస్యను పరిష్కరించుకోవాలని మంగళవారం కోటయ్య కమిటీ, బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు చర్చించారు.


 రిజర్వు బ్యాంకుతో సంబంధం లేకుండానే అమలుచేస్తాం: యనమల
 
 రిజర్వుబ్యాంకుతో సంబంధం లేకుండా తాము హామీ ఇచ్చిన రైతు రుణాల మాఫీని అమలు చేస్తామని, లక్ష కోట్లయినా వెనుకాడబోమని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టంచేశారు. బ్యాంకింగ్‌రంగం రైతు రుణాల మాఫీకి ఎప్పుడూ అనుకూలం కాదని, అంతమాత్రాన తాము ప్రజలకోసం ఇచ్చిన హామీని అమలుచేయకుండా ఉండలేమని చెప్పారు. ఆయన మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో మీడియాతో మాట్లాడు తూ... బ్యాంకులు పటిష్టంగా ఉండాలని రిజర్వుబ్యాంకు కోరుకుం టుం దని, ప్రజలు పటిష్టంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి జమచేస్తున్నప్పుడు మాఫీకి బ్యాంకులకు అభ్యంతరమెందుకు? వాటికి నష్టమేమిటి? అని ప్రశ్నించారు. అయితే నిపుణుల కమిటీ సిఫార్సులు వచ్చాక... బ్యాంకులకు ఎన్ని దఫాల్లో చెల్లించాలన్న దానిపై విధానాలు రూపొందిస్తామన్నారు. కార్పొరేట్ కంపెనీలకు వేలకోట్లు రుణమాఫీలు చేసే బ్యాంకులు దేశంలో 70 శాతం మంది జనాభాగా ఉన్న రైతుల విషయంలో వీలుపడదంటూ అభ్యంతరాలు చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. బ్యాంకుల తీరు ఎలా ఉన్నా, తాము రైతులను ఆదుకొనేందుకు లక్ష కోట్లయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
 
 ఆగస్టులో ఆర్థిక, ప్రణాళికా సంఘం ప్రతినిధులు: ఆగస్టులో రాష్ట్రానికి ఆర్థిక, ప్రణాళికాసంఘం ప్రతినిధులు రానున్నారని యనమల తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులను అధ్యయ నం చేసి వారికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాల్సి ఉంటుందని, ఆ మేరకు విభజన చట్టంలోనే స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. దీనిపై తాము ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో మాట్లాడామని, ఆగస్టులో వస్తామని వారు చెప్పారని తెలిపారు.

మరిన్ని వార్తలు