పురుగు మందులు ఇంట్లో లేకపోతే.. ఆత్మహత్యలు ఆగుతాయా?

15 Sep, 2015 10:51 IST|Sakshi
పురుగు మందులు ఇంట్లో లేకపోతే.. ఆత్మహత్యలు ఆగుతాయా?

రసాయనిక పురుగు మందులు రైతుల ఇళ్లలో అందుబాటులో లేకుండా చేస్తే.. భారత దేశంలో ఆత్మహత్యలు చాలా వరకు తగ్గుతాయా? అవుననే అంటున్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ.). తమిళనాడులోని రెండు గ్రామాల రైతులందరి పురుగు మందులను ఓ గోదాములో భద్రపరచగా.. ఆత్మహత్యల సంఖ్య బాగా తగ్గిందని డబ్ల్యూ.హెచ్.ఓ. తెలిపింది. సాధారణంగా రైతులెవరైనా పంటలకు వాడాల్సిన పురుగుమందులను తెచ్చుకొని ఇంటి దగ్గరే పెట్టుకుంటారు. పంట నష్టపడడం, అప్పుల పాలవడం, కుటుంబ సమస్యలు.. ఇలా వాగ్వాదానికి కారణం ఏదైనప్పటికీ..

ఇంట్లో వాళ్లతో గొడవ పడి మాటకుమాట తూలిన క్షణికావేశంలో పురుగు మందు తాగడం ఆత్మహత్యల సంఖ్య పెరుగుదలకు దారితీస్తోందని ఒక అంచనా. ఆత్మహత్యలను నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ  చెన్నై (తమిళనాడు)కు సమీపంలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న కందమంగళం, కురంగుడి గ్రామాల్లో చిన్న ప్రయోగం చేసింది. మల్లెపూల సాగుకు ఈ పల్లెలు పెట్టింది పేరు. మల్లె తోటలపై 15 రోజులకొకసారి పురుగు మందులు పిచికారీ చేస్తారు. అందుకే అక్కడ ప్రయోగాత్మకంగా పురుగు మందుల బ్యాంకును డబ్ల్యు.హెచ్.ఓ. ఏర్పాటు చేసింది.  
 
ఇళ్లకు దూరంగా ఉన్న భవనంలో ఒక గదిలో గోడకు ఆనుకొని ప్లైవుడ్‌తో చిన్న చిన్న సొరుగులు ఏర్పాటు చేశారు. ప్రతి రైతు కుటుంబానికి ఒక సొరుగును కేటాయించారు. ఆ కుటుంబానికి చెందిన పురుగు మందులను ఆ సొరుగులో దాచారు. ఇద్దరు స్థానికులకు ఈ బ్యాంకు నిర్వహణ బాధ్యతను అప్పగించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇది తెరచి ఉంటుంది. పంటపై పురుగు మందులు చల్లాలనుకున్న రోజున రైతు తన పురుగు మందులను నేరుగా పొలానికి తీసుకెళ్లొచ్చు.

ఆ రెండు గ్రామాల్లో అంతకుముందు ఏడాది 35 మంది పురుగుమందులు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఏడాది పాటు ఈ పద్ధతిని అమలు చేయడంతో ఆత్మహత్యల సంఖ్య ఐదుకు తగ్గింది! పురుగుల మందులను ఇంటికి దూరంగా ఉంచితే ఆత్మహత్యలను కొంతమేరకు అరికట్టవచ్చని ఆ రెండు గ్రామాల ప్రజలకే కాకుండా పరిసర గ్రామాల ప్రజలకూ నమ్మకం కుదిరింది. ఇటువంటి బ్యాంకులను తమ గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసుకోవాలని స్థానిక సంస్థల నేతలు కొందరు ప్రయత్నిస్తున్నారు. అయితే, విష రసాయనాలు వాడకుండా లాభసాటి సేద్యాన్ని ప్రోత్సహిస్తే దీనికన్నా ఇంకెంతో మేలు కదూ..!

మరిన్ని వార్తలు