ఒకటైనా.. రెండైనా.. మన రాష్ట్రమే: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

13 Aug, 2013 02:18 IST|Sakshi
ఒకటైనా.. రెండైనా.. మన రాష్ట్రమే: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గందరగోళపరిచే వ్యాఖ్య చేశారు. ‘‘రాష్ట్రం ఒక్కటిగా ఉన్నా.. రెండైనా మన రాష్ట్రమే’’ అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఇంకా చాలా ప్రక్రియ జరగాల్సి ఉందని, దీనిపై కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ చర్చిస్తుందని చెప్పారు. ఇంతకు మించి విభజనపై తానేమీ మాట్లాడబోనన్నారు. సీఎం సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఆదివారం నాటి బీజేపీ బహిరంగ సభలో ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ.. రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, కాంగ్రెస్ పెద్దలపై చేసిన విమర్శలను కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి గురించి మోడీ వ్యాఖ్యలు అసత్యాలని కొట్టిపారేశారు. ‘‘అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఎవరూ సాటిరారు. గుజరాత్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు మనమే మార్గదర్శిగా నిలిచాం. ఈ విషయంలో గుజరాత్‌కు - ఏపీకి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. విపరీతమైన పదవీ కాంక్షతో ముందుకు వెళుతున్న నరేంద్ర మోడీ అబద్ధాలు, అసత్యాలు చెప్తున్నారు.
 
 ఇది సరికాదు’’ అని పేర్కొన్నారు. ‘‘గుజరాత్‌లో 4 లక్షల పెన్షన్లు ఇస్తే మన రాష్ట్రంలో దాదాపు 70 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. గుజరాత్‌లో 72 వేల మహిళా పొదుపు సంఘాలు ఉంటే మన రాష్ట్రంలో 10 లక్షల పొదుపు సంఘాల్లో కోటి మంది సభ్యులున్నారు. దేశంలో మహిళలకు ఇస్తున్న రుణాల మొత్తంలో 60 శాతం మన రాష్ట్రం వాళ్లకే చెల్లిస్తున్నాం. ప్రజాపంపిణీ వ్యవస్థలోనూ మనకు సాటి ఎవరూ లేరు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంతో దేశానికే ఆదర్శమయ్యాం. రైతు రుణాలు, ఇళ్ల నిర్మాణం, ఉచిత విద్యుత్.. ఇలా ఏ రంగంలో చూసుకున్నా గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లే కాదు.. దేశంలో మరే రాష్ట్రంతో పోల్చినా మనమే ముందున్నాం’’ అని పేర్కొన్నారు. ‘‘నీ మాటలు నమ్మి మోసపోవటానికి ఇదేమీ గుజరాత్ కాదు. ఇక్కడి ప్రజలు చాలా తెలివైన వాళ్లు. మత విద్వేషాలు రెచ్చగొడితే రెచ్చిపోయేవాళ్లు, మోసపోయేవాళ్లు ఎవరూ లేరిక్కడ’’ అని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
 
 పారిశ్రామిక ప్రగతిలోనూ గుజరాత్ పైనే ఉన్నాం...
 నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించడంలోనూ గుజరాత్, తమిళనాడు కంటే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని కిరణ్ చెప్పారు. గుజరాత్‌లో పారిశ్రామిక ప్రగతి గురించి పదేపదే గొప్పగా చెప్పుకునే మోడీ పారిశ్రామిక పెట్టుబడుల విషయంలోనూ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం దక్కించుకోగా, గుజరాత్ మూడో స్థానానికి పరిమితమైంద నే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో అనేక సమస్యలు తలెత్తినప్పటికీ పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఏపీ రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఇటీవల మన రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం గుజ రాత్ వెళితే ‘మీ రాష్ట్రం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని ప్రశంసలు కురిపించిన మోడీ హైదరాబాద్‌కు వచ్చి అందుకు భిన్నంగా మాట్లాడటం శోచనీయమన్నారు.
 
 యుద్ధం సృష్టించేలా మాట్లాడటం తగదు...
 అంతర్జాతీయ సంబంధాలు, సరిహద్దు సమస్యలపై జాగ్రత్తగా వ్యవహరించాలే తప్ప ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం సృష్టించేలా మాట్లాడటం మోడీకి తగదన్నారు. అన్ని దేశాల వద్ద అధునాతన ఆయుధాలున్న నేపథ్యంలో ఏదైనా జరిగితే ఇబ్బందికరమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్‌కింగ్‌ల స్ఫూర్తితోనే అమెరికా అధ్యక్షుడిని కాగలిగానంటూ ఒబామా గర్వంగా చెప్పుకుంటే.. గాంధీ పుట్టిన గుజరాత్ నుంచి వచ్చిన మోడీ మాత్రం ఒబామా వ్యాఖ్యలు ‘వి కెన్... వి డూ’ అనే మాటలు కాపీ కొట్టటం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు.
 
 అన్నీ కలిసి వచ్చినా సరే.. విడివిడిగా వచ్చినా సరే...
 ‘తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌ను మోడీ పొగడటం ద్వారా.. చంద్రబాబుతో బీజేపీ పొత్తుకు సంకేతాలు పంపినట్లు భావిస్తున్నారా?’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ.. ‘‘అన్ని పార్టీలూ కలిసి వచ్చినా.. విడివిడిగా వచ్చినా ఎదుర్కోవటానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది’’ అని బదులిచ్చారు. రాష్ట్రం విడిపోతే ఎదురయ్యే సమస్యలపై మీరు చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా వాటిపై మాట్లాడాల్సిన అవసరమే లేదన్నారు. ‘పదే పదే మన రాష్ట్రం, మన రాష్ట్రం అంటూ మీరు 21 సార్లు ఉచ్ఛరించారు... రేపు రెండు రాష్ట్రాలు కాబోతున్నాయి కదా?’ అని ఒక విలేకరి అడిగితే.. ‘‘ఒకటి అయినా రెండు అయినా మన రాష్ట్రమే’’అని కిరణ్ నవ్వుతూ ప్రెస్‌మీట్‌ను ముగించారు.

మరిన్ని వార్తలు