జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

19 Oct, 2015 21:39 IST|Sakshi
జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ప్రాణహిత- చేవెళ్ల  ప్రాజెక్టు, మంత్రి కేటీఆర్ లపై ప్రతిపక్ష నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అధికార టీఆర్ఎస్ పార్టీ రెండేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తిచేస్తానని చెప్పడం సత్యదూరం. రాష్ట్రం కాదు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగినా రెండేళ్లలో పూర్తిచేయలేదు. మంత్రి హరీశ్ రావుకు ఇదే నా సవాల్.. ఒకవేళ టీఆర్ఎస్ ఆ పని చేయగలిగితే.. ఆ పార్టీ తెలంగాణకు గొప్పధనమని నిరంతరం చెబుతా' అని వ్యాఖ్యానించారు.

మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'పెద్దనేతలను ఎదిరిస్తున్నట్లుగా వ్యవహరిస్తే ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుందనుకోవటం భ్రమ. అలాంటి మాటలు వారి అహంకారానికి నిదర్శనం. నేను ప్రారంభించిన మండల వ్యవస్థను నిర్వహించడానికే కేటీఆర్ ప్రయాసపడుతున్నారు. ఐదేళ్ల తర్వాత ఎవరేంటో ప్రజలే తేలుస్తారంటున్న మంత్రులు.. ఇప్పుడు మమ్మల్ని విమర్శించడంలో ఏమైనా అర్థం ఉందా?' అని జానా ఫైర్ అయ్యారు.

తాగునీటి సదుపాయాల కల్పనకు మంత్రి కేటీఆర్ చేసిందేమీలేదని, తాను మంత్రిగా ఉన్న సమయంలో సిరిసిల్లకు కేటాయించిన రూ.50 కోట్లు ఇంకా ఖర్చుచేయనేలేదని జానా వాపోయారు. మాటలు మాట్లాడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావని మంత్రులకు చురకలంటించారు.

సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన జానారెడ్డి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక, అమరావతి శంకుస్థాపన తదితర అంశాలపై అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. 'ఇద్దరు సీఎంలు సహకరించుకోవాల్సిన అవసరం ఉందని నేను మొదట్లోనే చెప్పాను. అప్పట్లో నామాట ఎవరైనా విన్నారా అనేది పక్కన పెడితే, ఇప్పటికైనా కలిసి మాట్లాడుకున్నందుకు కేసీఆర్, చంద్రబాబులను అభినందిస్తున్నా' అన్నారు. అమరావతి శంకుస్థాపనకు తాను వెళ్లడంలేదని, అయితే తన సందేశం మాత్రం పంపానని జానా చెప్పారు.

మరిన్ని వార్తలు