'మా ఆస్తులన్నీ రాసిచ్చేస్తా..'

25 May, 2017 12:02 IST|Sakshi
'మా ఆస్తులన్నీ రాసిచ్చేస్తా..'

► నాపై ఐటీకి ఫిర్యాదు యడ్యూరప్ప పనే
►రూ.300-400 కోట్లిస్తే మా ఆస్తులు రాసిస్తా
►జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి


బెంగళూరు: తన కుటుంబం వద్ద రూ. 20 వేల కోట్ల బినామీ ఆస్తులున్నట్లు కేంద్ర ఐటీకి ఫిర్యాదు వెళ్లడం వెనుక బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప హస్తం ఉన్నట్లు జేడీఎస్‌ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ఆరోపించారు. తనకెవరైనా రూ.300– 400 కోట్లు ఇస్తే తన కుటుంబం పేరుతో ఉన్న ఆస్తులన్నీ రాసిచ్చేస్తానని సవాల్‌ విసిరారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది ఉండగా, తమ కుటుంబంపై రాజకీయ అక్కసుతో ఈ ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన విధానసౌధలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తనపై ఫిర్యాదు చేసిన వెంకటేష్‌గౌడ కాంగ్రెస్‌ కార్యకర్త కాదని పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ ప్రకటించారని, అతడు యడ్యూరప్ప మనిషని కుమార విమర్శించారు.

ఆ ఫిర్యాదు ఎక్కడ టైప్‌ అయ్యిందనేది తనకు తెలుసన్నారు. ఈ కుతంత్రం వెనక యడ్యూరప్ప హస్తం ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. యడ్యూరప్పతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నా...సదరు ఫిర్యాదు పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి, ఒకవేళ బినామి ఆస్తులు రూ.20వేల కోట్లు బయటపడితే వెంటనే సదరు సొమ్మును రాష్ట్రంలోని రైతుల రుణాలను మాఫీ చేయడానికి వినియోగించవచ్చు.’ అని కుమారస్వామి సవాలు విసిరారు. రానున్న ఎన్నికల్లో పార్టీకి రూ.300 నుంచి రూ.400 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఎవరైనా ఈ సొమ్మును ఇస్తే తమ కుటుంబం పేరుమీద ఉన్న ఆస్తులు రాసిస్తానని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు కుమారస్వామి సమాధానమిచ్చారు.


కుమార ఆస్తులు రూ.20 వేల కోట్లు
జేడీఎస్‌ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి, ఆయన కుటుంబం బినామీ పేర్లతో రూ.20వేల కోట్ల ఆస్తులు సంపాదించిందని వెంకటేష్‌ గౌడ అనే వ్యక్తి కేంద్ర ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారు. రియల్‌ఎస్టేట్, చిత్రనిర్మాణం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు తదితర రంగాల్లో కుమారస్వామి కుటుంబం బినామీ పేర్లతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోందని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.

కుమారస్వామి, కుటుంబానికి రూ.20 వేల కోట్ల విలువ చేసే స్థిరాస్తులు బెంగళూరు, ఢిల్లీతో పాటు అమెరికా తదితర చోట్ల ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఎక్కువ భాగం జేడీఎస్‌ జాతీయాధ్యక్షుడు దేవేగౌడ కోడలు కవిత పేరు పైన ఉన్నాయన్నారు. సాధారణ గృహిణి అయిన కవిత కోట్ల ఆస్తులను ఎలా సంపాదించారని అన్నారు. ఈ విషయమై దర్యాప్తు జరిపితే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని అందులో పేర్కొన్నారు.  

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు