'బీఫ్ తినకపోతే చచ్చిపోతారా.. పాక్ వెళ్లండి'

22 May, 2015 14:25 IST|Sakshi
'బీఫ్ తినకపోతే చచ్చిపోతారా.. పాక్ వెళ్లండి'

గోవధను నిషేధించడం మీద కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. గోమాంసం తినకపోతే చచ్చిపోతారనకుంటే.. పాకిస్థాన్ వెళ్లాలని సలహా ఇచ్చారు. దానివల్ల లాభం గానీ, నష్టం గానీ లేవని, అది కేవలం విశ్వాసాలకు సంబంధించిన విషయమని ఆయన అన్నారు. హిందువులకు సున్నితమైన అంశమని ఆయన ఆజ్తక్ టీవీ ఛానల్ నిర్వహించిన 'మంథన్' సదస్సులో చెప్పారు.

గోమాంసం తినకపోతే చచ్చిపోయేవాళ్లు పాకిస్థాన్కు గానీ, అరబ్బు దేశాలకు గానీ వెళ్లాలని లేదా ప్రపంచంలో మరే ప్రాంతంలోనైనా అది అందుబాటులో ఉంటే అక్కడకు పోవాలని సూచించారు. కొంతమంది ముస్లింలు కూడా గోవధకు వ్యతిరేకమేనని ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. గోవా, జమ్ము కాశ్మీర్, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఈ తరహా మాంసమే తింటారని, కేంద్రం దేశవ్యాప్తంగా గోవధను నిషేధించగలదా అంటూ మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను నఖ్వీ ఖండించారు.

మరిన్ని వార్తలు