గోవు రక్షకులపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

30 Jul, 2016 12:02 IST|Sakshi
గోవు రక్షకులపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇటీవల కేంద్ర కేబినెట్‌లో చేరిన దళిత నాయకుడు రాందాస్‌ బాండు అథావాలె గోవుల రక్షణ పేరిట దళితులమీద జరుగుతున్న దాడులపై స్పందించారు. మనుషుల ప్రాణాలు పణంగా పెట్టి గోవుల రక్షణ చేయడం ఎంతమాత్రం సరికాదని ఆయన పేర్కొన్నారు. గోవుల రక్షణ పేరిట మనుషులను చంపుతూపోతే.. మరీ మానవ రక్షణ ఎవరు చేపడతారని ఆయన ప్రశ్నించారు. గుజరాత్‌లోని ఉనా తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆవు చర్మాన్ని వలిచారని ఉనాలో దళిత యువకులని కారుకు కట్టేసి గోరక్షకులు దారుణంగా కొట్టిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

మహారాష్ట్రకు చెందిన రాందాస్ అథావాలే కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉంది. ‘ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాందాస్‌ దళితులు బుద్ధిజంలోకి మారాలని పిలుపునిచ్చారు. దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నానని చెప్తున్న మాయావతి ఇంకా ఎందుకు బుద్ధిస్టుగా మారలేదని ఆయన ప్రశ్నించారు.

ఉనా ఘటన చాలా తీవ్రమైనదని రాందాస్‌ పేర్కొన్నారు. ‘గోవుల రక్షకులను నేను ఒక్కటే విషయం అడుగుతున్నా.. గో హత్యకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి. అయినా, మీరెందుకు గో రక్షణ పేరిట మానవ హత్యలు చేపడుతున్నారు. మీరు ఈ విధంగా గోవుల రక్షణ చేస్తే.. అప్పుడు మనుషులను ఎవరు రక్షిస్తారు?’ అని ఆయన అన్నారు.    
 

మరిన్ని వార్తలు