ఉగ్రవాదులు కుటుంబాలను మరిచిపోవాల్సిందే!

21 Feb, 2017 13:16 IST|Sakshi
ఉగ్రవాదులు కుటుంబాలను మరిచిపోవాల్సిందే!

న్యూఢిల్లీ: మానవత్వం మరిచి బాంబు దాడులతో అమాయకుల ప్రాణాలను తీసే ఉగ్రవాదులు తమ కుటుంబాలను సైతం మరిచిపోవాలని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 1996 లజ్‌పత్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో శిక్షననుభవిస్తున్న జమ్మూ కశ్మీర్‌ ఇస్లామిక్‌ ఫ్రంట్‌ (జేకేఐఎఫ్‌) తీవ్రవాది మొహమ్మద్‌ నౌషద్‌ ఫిబ్రవరి 28న తన కూతురి పెళ్లి కోసం మధ్యంతర బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రధాన న్యాయమూర్తి ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చండ్రచూడ్, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్‌ల ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.

ఈ సందర్భంగా జస్టిస్‌ ఖేహర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘విచక్షణా రహితంగా అమాయకులను చంపే దుశ్చర్యల్లో పాలుపంచుకున్న వ్యక్తులెవరైనా తమ కుటుంబాలను, బంధుత్వాలను మరిచిపోవడం మంచిది. అటువంటి వారికి ఎటువంటి పెరోల్, బెయిల్‌ లభించద’ ని వ్యాఖ్యానిస్తూ తీవ్రవాది నౌషద్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించారు. ఢిల్లీలో రద్దీగా ఉండే లజ్‌పత్‌నగర్‌ మార్కెట్‌లో 1996, మే21న జేకేఐఎఫ్‌ ఉగ్రవాదులు దొంగలించిన ఓ మారుతీ కారులో పేలుడు పదార్థాలు అమర్చి శక్తిమంతమైన పేలుడు జరిపారు. ఈ దాడిలో 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 

మరిన్ని వార్తలు