ట్రిపుల్ ఐటీ అమేథి క్యాంపస్ తరలింపు

4 Aug, 2016 19:45 IST|Sakshi

అమేథి: ఐఐఐటీ-అమేథి క్యాంపస్ ను కేంద్ర ప్రభుత్వం మూసేసింది. క్యాంపస్ లో విద్యనభ్యసిస్తున్న 148 మంది విద్యార్థులను మంగళవారం ప్రభుత్వం అలహాబాద్ క్యాంపస్ కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఐఐటీ-అమేథీ స్థానంలో అంబేద్కర్ యూనివర్సిటీ,లక్నో కింద కొత్త యూనివర్సిటీ వస్తుందని క్యాంపస్ విద్యార్థులందరినీ ఐఐఐటీ-అలహాబాద్ కు మార్చినట్లు ఐఐఐటీ-అలహాబాద్ డైరెక్టర్ జీసీ నంది బుధవారం తెలిపారు. కాగా ఐఐఐటీని మూసివేసి దాని స్థానంలో అంబేద్కర్ యూనివర్సిటీ కింద శాటిలైట్ ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించనున్నట్లు ఈ ఏడాది మేలో అప్పటి మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించిన విషయం తెలిసిందే.

విద్యార్థులకు అలహాబాద్ లో చదువుకునేందుకు అవకాశం కల్పించిన కేంద్రం 75 మంది లెక్చరర్లపై ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో వారందరూ ధర్నాకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ఎటువంటి నిర్ణయం ప్రకటించని పక్షంలో ఆగష్టు 12 నుంచి ఉద్యమం బాటపడతామని వారు హెచ్చరించారు.

11 ఏళ్లపాటు విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఐఐఐటీ మూతపడటానికి కారణాలేమిటి? కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి గాంధీల కుటుంబానికి అమేథి నియోజకవర్గం కంచుకోటగా వస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ అక్కడి నుంచే లోక్ సభకు ఎన్నికయ్యారు. కాగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొత్తం మూడు ప్రాజెక్టులే ఆగిపోయాయి. ఆగిపోయిన మూడు ప్రాజెక్టులు అమేథివే కావడం విశేషం. మెగా ఫుడ్ పార్కు, హిందుస్తాన్ పేపర్ మిల్ లు ఈ వరుసలో ఐఐఐటీ-అమేథీ కంటే ముందున్నాయి. గాంధీలకు సపోర్టు చేస్తున్న ప్రాంతం కాబట్టే ఇక్కడి ప్రాజెక్టులను ప్రభుత్వం వేరే చోటుకు మారుస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని వార్తలు