ఐఐటీ విద్యార్థిని అదృశ్యం

20 Jan, 2016 13:36 IST|Sakshi
ఐఐటీ విద్యార్థిని అదృశ్యం

హిమాలయాలకు వెళ్తున్నట్టు ఉత్తరం

చెన్నై, సాక్షి ప్రతినిధి: అత్యున్నత ఉద్యోగాలకు బాటవేసే ఐఐటీ చదువును ఆపివేసి ఆధ్యాత్మిక జీవనం వైపు పయనమైందో విద్యార్థిని. ‘ఆధ్యాత్మిక జీవనం తన మనస్సును లాగుతోంది, హిమాలయాలకు వెళ్తున్నా’ అంటూ ఉత్తరం రాసిపెట్టి మరీ అదృశ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రత్యూష (20) మద్రాసు అడయారులోని ఐఐటీలో కళాశాలలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. ఐఐటీ ప్రాంగణంలోనే ఉన్న సబర్మతి హాస్టల్‌లో ఉంటోంది. ప్రత్యూష రెండ్రోజులుగా కనిపించడం లేదు.

ఆందోళనకు గురైన రూమ్మేట్స్ హాస్టల్ వార్డన్‌కు మంగళవారం సమాచారమిచ్చారు. వార్డన్ వెంటనే కొట్టూరుపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ప్రత్యూష ఉంటున్న హాస్టల్ గదిలో తనిఖీలు నిర్వహించగా తెలుగు, ఇంగ్లిషులో రాసిన ఉత్తరం దొరికింది. ‘ఆధ్యాత్మిక జీవనంపై రోజురోజుకూ నాకు ఆసక్తి పెరుగుతోంది, ఈ కారణంగా ఆధ్యాత్మిక జీవనాన్ని అన్వేషిస్తూ హిమాలయాలకు వెళుతున్నా.

నాకోసం వెతకవద్దు, తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని ఇవ్వండి’ అంటూ ఉత్తరంలో రాసింది. ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున ప్రత్యూష హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిందని, అయితే ఆమె స్వస్థలానికి చేరుకోలేదని తెలియడంతో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని మంగళవారం రాత్రి మద్రాసు ఐఐటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు