గ్లోబల్ గా దూసుకెళ్తున్న ఐఐటీలు

15 Mar, 2017 09:54 IST|Sakshi
గ్లోబల్ గా దూసుకెళ్తున్న ఐఐటీలు
భారత్ లో ఐఐటీ లకు ఎక్కడ లేని గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు మరింత రెట్టింపు చేస్తూ ప్రపంచంలోనే ఎక్కువగా యూనికార్న్ స్టార్టప్ అధిపతులను తయారుచేసేది ఐఐటీలేనని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. యూనికార్న్ స్టార్టప్ వ్యవస్థాపకులను తయారుచేయడంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు)లు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద స్థానంలో ఉన్నాయట. 1 బిలియన్ డాలర్లు(రూ.6600కోట్లు) లేదా అంతకంటే  ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్ లను యూనికార్న్ స్టార్టప్ అంటారు. యూకేకు చెందిన సాఫ్ట్ వేర్ సంస్థ సేజ్ గ్రూప్ ప్రకారం స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా తర్వాత ఐఐటీలు యూనికార్న్ స్టార్టప్ వ్యవస్థాపకులను తయారుచేస్తున్న ఇన్స్టిట్యూట్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచినట్టు తెలిసింది.
 
1బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన ప్రపంచవ్యాప్త స్టార్టప్ ల్లో ఐఐటీల నుంచి 12 ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మిట్, కార్నెల్ వంటి ఇన్స్టిట్యూట్ లు కూడా ఐఐటీల తర్వాత స్థానంలోనే ఉన్నాయి. ఐఐటీల్లో చదువుకున్న యూనికార్న్ స్టార్టప్ వ్యవస్థాపకుల్లో ఫ్లిప్ కార్ట్(సచిన్, బిన్నీ బన్సాల్), స్నాప్ డీల్(రోహిత్ బన్సాల్), షాప్ క్లూస్(సంజయ్ సేథి), ఓలా(భావిష్ అగర్వాల్, అంకిత్ భట్టి), జుమాటో(దీపేందర్ గోయల్, పంకజ్) వంటి వారున్నారు. యూనికార్న్ స్టార్టప్ ల జాబితాలోనూ ఇండియా మూడో అతిపెద్ద హబ్ గా నిలుస్తున్నట్టు తాజా అధ్యయనంలో తెలిసింది. ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానాన్ని దక్కించుకుంది. 
మరిన్ని వార్తలు