ఫెదరర్‌ శకం ముగిసినట్లేనా?

27 Jun, 2013 20:25 IST|Sakshi
Roger Federer

గ్రాస్ కోర్టుల రారాజు రోజర్ ఫెదరర్ కు ఊహించని షాక్ తలిగింది. ఎనిమిదోసారి వింబుల్డన్‌ టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టిద్దామనకున్న స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ఆశలు ఫలించలేదు. తనకెంతో గడ్డి మైదానంలో రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. ఏడుసార్లు వింబుల్డన్‌ ఛాంపియన్‌ అయిన ఫెదరర్‌ అనామక ఆటగాడి చేతిలో చిత్తయ్యాడు. హోరాహోరీగా సాగిన వింబుల్డన్‌ రెండో రౌండ్‌లో పోరులో ఉక్రెయిన్‌కు చెందిన అన్‌సీడెడ్‌ ఆటగాడు సెర్గీ స్టకోస్కీ చేతిలో అనూహ్య పరాజయం పాలయ్యాడు. ఈ ఓటమితో వరసగా 36 సార్లు గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌ చేరిన రికార్డుకు కూడా బ్రేక్‌ పడింది.  

వింబుల్డన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంత తొందరగా ఇంటిదారి పట్టడం కూడా ఇది కేవలం రెండోసారి మాత్రమే. వింబుల్డన్‌ ఓటమితో ఫెదరర్‌ శకం ముగిసిందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. స్విస్ వీరుడి సత్తా అయిపోయిందన్న అనుమానం టెన్నిస్‌ అభిమానుల్లో రేకిత్తింది. ఏకంగా ఏడుసార్లు విజేతగా నిలిచిన కోర్టులో రెండో రౌండ్ లోనే  ఫెడెక్స్‌ ఇంటిముఖం పట్టడంతో అతడి పనినైపోయిందన్న వాదన బలంగా విన్పిస్తోంది. వింబుల్డన్ లో ఓటమి ఫెదరర్ కు మింగుడు పడలేదు.  'ఏ మ్యాచ్‌ ఓడినా బాధగానే ఉంటుంది అయితే ఇక్కడ ఓడిపోవడం ఆ బాధను రెట్టింపు చేస్తుంది' అని మ్యాచ్ ముగిసిన ఫెదరర్ పేర్కొన్నాడు. ఈ మాటలు అతడి ఆవేదనను వెల్లడిస్తున్నాయి.

అంతేకాదు వయసు మీద పడిన ఫెదరర్‌ మళ్లీ గాడిలో పడగలడన్న నమ్మకాన్ని కూడా ఈ ఓటమి వమ్ము చేసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లోఓడినా తనకు అచ్చొచ్చిన గ్రాస్‌కోర్టుపై స్విస్‌ మాస్టర్‌ చెలరేగుతాడని అభిమానులు భావించారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పటికే 32 ఏళ్లున్న ఫెడెక్స్‌ మళ్లీ గాడిలో పడటం డౌటేనని బోరిస్‌ బెకర్‌లాంటి మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఎంత గొప్ప ఆటగాడికైనా టెన్నిస్‌లో 30 ఏళ్ల వయసు దాటితే తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం పెద్ద సవాలే. పైగా ప్రస్తుతం టెన్నిస్‌లో నాదల్‌, జొకోవిచ్‌, ముర్రే, ఫెర్రర్‌లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. వాళ్లతో పోటీ పడి మళ్లీ మునుపటి ఫామ్‌ను అందుకోవడం ఫెడెక్స్‌కు కష్టమేనని వాళ్లు పెదవి విరుస్తున్నారు.

రెండో రౌండ్‌లో ఓడినంత మాత్రాన తన పని అయిపోయిందని భావించాల్సిన అవసరం లేదని తాను మళ్లీ పుంజుకుంటానని ఫెడెక్స్‌ చెబుతున్నా అది అంత సులువైన పని కాదని మాత్రం స్పష్టమవుతోంది. కాగా, తన శకం ముగియలేదని ఫెదరర్ స్పష్టం చేశాడు. మరిన్ని సంవత్సరాలు టెన్నిస్ ఆడతానని చెప్పాడు.

మరిన్ని వార్తలు