బంగారం ధరలు పైపైకి

14 Aug, 2013 01:38 IST|Sakshi
బంగారం ధరలు పైపైకి

న్యూఢిల్లీ: పుత్తడి ధరలు మరింత ఎగబాకేలా ప్రభుత్వం సుంకాల మోత మోగించింది. రూపాయి క్షీణతకు అడ్డుకట్టడవేయడమే లక్ష్యంగా బంగారం దిగుమతులను తగ్గించి... వినియోగం, డిమాండ్‌కు చెక్ పెట్టేందుకు చర్యలు ప్రకటించింది. పసిడి, వెండి, ప్లాటినంలపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 10 శాతానికి చేరుస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆర్థిక మంత్రి పి.చిదంబరం పార్లమెంట్‌కు దీన్ని సమర్పించారు. తాజా చర్యలతో పసిడి రేటుకు రెక్కలు రానున్నాయి. 10 గ్రాముల ధర రూ.600 మేర పెరగవచ్చని నోటిఫై అనంతరం బులియన్ ట్రేడర్లు పేర్కొన్నారు. ఇక రాజధాని ఢిల్లీలో ఐదోరోజూ పుత్తడి పరుగులు తీసింది. రూ. 30 వేల దరిదాపుల్లోకి దూసుకెళ్లింది. రూ.565 పెరిగి రూ.29,825కు చేరింది. కాగా, ఈ ఏడాదిలో ఈ మూడు లోహాలపై సుంకాలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం.కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్), రూపాయి పతనానికి కళ్లెం వేసేందుకు సుంకాల పెంపు సహా పలు చర్యలను తీసుకుంటున్నట్లు చిదంబరం పార్లమెంట్‌లో సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే నిర్ణయాలు వెలువడ్డాయి. కాగా, నిత్యావసరంకాని వస్తువుల దిగుమతిపై సుంకం పెంపు ఇతరత్రా ప్రతిపాదిత అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, త్వరలోనే చర్యలు ఉంటాయని రెవెన్యూ కార్యదర్శి సుమిత్ బోస్ చెప్పారు.
 
 పెంపు ఇలా...
 ప్రామాణిక బంగారం, ప్లాటినంలపై దిగుమతి(కస్టమ్స్) సుంకాన్ని 2 శాతం పెంచారు. దీంతో ఇది ఇప్పుడున్న 8 శాతం నుంచి 10 శాతానికి చేరింది. కాగా, వెండిపై కస్టమ్స్ సుంకం ఏకంగా 4 శాతం పెరిగింది. ప్రస్తుతం 6 శాతం ఉండగా... దీన్ని కూడా 10 శాతానికి చేర్చారు. తాజా చర్యలతో ఈ ఏడాది(2013-14)లో ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ.4,830 కోట్ల ఆదాయం లభించవచ్చని అంచనా. ఇదిలాఉండగా... ముడి బంగారం, పూర్తిగా శుద్ధిచేయని(డోర్) గోల్డ్ బార్స్ దిగుమతిపైన కూడా కస్టమ్స్ సుంకంలో కూడా మార్పులు జరిగాయి. వీటిపై సుంకాన్ని ఇప్పుడున్న 6 శాతం నుంచి 8 శాతానికి చేర్చారు. ఇక సిల్వర్ డోర్ బార్స్‌పై సుంకం 3 శాతం నుంచి 7 శాతానికి పెంచారు. ఈ మార్పుల కారణంగా ముడి బంగారం, డోర్ బార్స్ నుంచి ఉత్పత్తి చేసిన శుద్ధిచేసిన(రిఫైన్డ్) పసిడి కడ్డీలు, కాపర్ స్మెల్టింగ్ నుంచి తయారుచేసిన బం గారంపై ఎక్సైజ్ సుంకాన్ని 7% నుంచి 9 శాతానికి పెంచారు. అదేవిధంగా ముడి వెండి/డోర్ బార్స్/రాగి, జింక్, లెడ్ స్మెల్టింగ్ నుంచి ఉత్పత్తి చేసిన స్వచ్ఛమైన వెండిపై ఎక్సైజ్ సుంకం 4% నుంచి 8 శాతానికి పెరిగింది.
 
 క్యాడ్‌కు కళ్లెం...
 ఆందోళనకరంగా పరిణమిస్తున్న క్యాడ్(మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారకం మధ్య వ్యత్యాసం)ను తగ్గించేందుకు బంగారం దిగుమతులను ప్రభుత్వం కట్టడిచేస్తూ వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో 4 శాతంగా ఉన్న పుత్తడి దిగుమతి సుంకాన్ని మూడుసార్లు పెంచడంతో 10 శాతానికి ఎగసింది. గతేడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(4.8%-88.2 బిలియన్ డాలర్లు) చేరింది. ముఖ్యంగా పసిడి, ముడిచమురు దిగుమతుల జోరే దీనికి కారణంగా నిలిచింది. జీడీపీతో పోలిస్తే క్యాడ్‌ను ఈ ఏడాది 3.7 శాతానికి(70 బిలియన్ డాలర్లు) చేర్చాలనేది ప్రభుత్వ లక్ష్యమని చిదంబరం ప్రకటించిన సంగతి తెలిసిందే. అధిక క్యాడ్, వాణిజ్యలోటు, అంతర్జాతీయ పరిణామాల కారణంగా రూపాయి విలువ కొత్త కనిష్టాలకు పడిపోతోంది. తాజాగా 61.80 స్థాయిని తాకింది కూడా.
 
 పెరుగుతున్న దిగుమతులు...
 ఈ ఏడాది మే, జూన్ నెలల్లో పుత్తడి, వెండి దిగుమతులు కాస్త తగ్గినప్పటికీ.. జూలైలో మళ్లీ పెరిగాయి. జూన్(2.4 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే విలువ పరంగా 18% పెరిగి 2.9 బిలియన్ డాలర్లకు చేరాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో(ఏప్రిల్-జూలై) 383 టన్నుల బంగారం దిగుమతైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 205 టన్నులతో పోలిస్తే 87% పెరిగాయి. విలువపరంగా చూస్తే రూ.56,488 కోట్ల నుంచి రూ.95,092 కోట్లకు(68 శాతం పెరుగుదల) ఎగబాకాయి. ఇక వెండి దిగుమతులు కూడా దూసుకెళ్తున్నాయి. తొలి 4 నెలల్లో ఏకంగా 200 శాతం పెరిగాయి. గతేడాది ఏప్రిల్-జూలై మధ్య రూ.4,281 కోట్ల విలువైన వెండి దిగుమతికాగా... ఈ ఏడాది ఇదే వ్యవధికి రూ.12,789 కోట్లకు చేరాయి. గతేడాది భారత్‌లోకి 845 టన్నుల(విలువ రూ.2.45 లక్షల కోట్లు) బంగారం; 1,963 టన్నుల(రూ.10,691 కోట్లు) వెండి దిగుమతైంది.
 
 స్మగ్లింగ్ నివారణకు చర్యలు: జేడీ శీలం
 సుంకాలను ఎడాపెడా పెంచడంవల్ల స్వల్పకాలంలో బంగారానికి డిమాండ్ తగ్గినప్పటికీ... స్మగ్లింగ్ పెరిగేందుకు దారితీస్తుందని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. అయితే, స్మగ్లింగ్ పెరగకుండా అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం అప్రమత్తంగానే వ్యవహరిస్తోందని రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలం చెప్పారు. దీన్ని అరికట్టేందుకు కస్టమ్స్ ఇతరత్రా విభాగాలు చురుగ్గానే పనిచేస్తున్నాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో రూ.75 కోట్ల విలువైన 295 కేజీల బంగారాన్ని కస్టమ్స్ విభాగం సీజ్ చేసిందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు