ఐఎన్‌ఎస్ అరిహంత్ రెడీ!

11 Aug, 2013 04:03 IST|Sakshi
ఐఎన్‌ఎస్ అరిహంత్ రెడీ!

న్యూఢిల్లీ: సొంత అణు జలాంతర్గామి త్రయాన్ని సమకూర్చుకునే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన భారత తొలి అణు జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ అరిహంత్’ ఎట్టకేలకు సముద్ర పరీక్షలకు సిద్ధమైంది. విశాఖపట్నం తీరంలో నావికాదళానికి చెందిన స్థావరంలో శుక్రవారం రాత్రి జలాంతర్గామిపై ఉన్న పరమాణు రియాక్టర్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా క్రియాశీలం చేశారు. దీంతో ఈ జలాంతర్గామి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అణు ఇంధనంతో నడిచే ఐఎన్‌ఎస్ అరిహంత్‌పై గల అణు రియాక్టర్‌ను క్రియాశీలం చేసినందున ఈ జలాంతర్గామికి త్వరలోనే వివిధ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే, అరిహంత్‌పై క్రియాశీలం చేసిన  రియాక్టర్ పనితీరును తెలుసుకునేందుకు దానిని కాసేపు ఆపేయనున్నామని ‘అణు శక్తి సంఘం(ఏఈసీ)’ చైర్మన్ ఆర్‌కే సిన్హా తెలిపారు. ప్రస్తుతం రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్‌ల వద్ద మాత్రమే అణు జలాంతర్గాములు ఉన్నాయి.
 
  అరిహంత్‌ను సమకూర్చుకోవడంతో భారత్ కూడా వాటి సరసన చేరనుంది. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో సమకూర్చుకుంటున్న అణు జలాంతర్గాముల త్రయంలో ఐఎన్‌ఎస్ అరిహంత్ మొదటిది. రూ.15 వేల కోట్లతో నిర్మించిన దీనిని ప్రధాని మన్మోహన్ 2009లో ప్రారంభించారు. ఆరు వేల టన్నుల బరువు ఉండే ఈ జలాంతర్గామి కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు కొన్ని నెలలపాటు  పరీక్షలు ఎదుర్కోనుంది. 82.5 మెగావాట్ల అణు రియాక్టర్‌తో నడిచే ఈ జలాంతర్గాములు భూ, గగన, సముద్రతలాల్లోని లక్ష్యాలపైకి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించగలవు. రష్యా నుంచి లీజుకు తీసుకున్న అకులా-2 తరగతికి చెందిన ఐఎన్‌ఎస్ చక్ర జలాంతర్గామిని భారత్ ప్రస్తుతం ఉపయోగిస్తోంది. అరిహంత్‌పై అణు రియాక్టర్‌ను క్రియాశీలం చేసిన శాస్త్రవేత్తలను ప్రధాని మన్మోహన్, రక్షణ మంత్రి ఆంటోనీలు  అభినందించారు.  
 

మరిన్ని వార్తలు