ఆర్టీసీ బస్ కండక్టర్ ఎంతపనిచేశాడు..!

26 Sep, 2016 15:11 IST|Sakshi
ఆర్టీసీ బస్ కండక్టర్ ఎంతపనిచేశాడు..!

చిల్లర లేదంటూ టికెట్ల వెనుక ఇవ్వాల్సిన అమౌంట్ ను రాయడం ఆర్టీసీ కండక్టర్లందరికీ అలవాటే. కొన్ని సార్లు రావాల్సిన చిల్లర మర్చిపోయి మనం బస్సు దిగేస్తాం. ఇంకొంతమందైతే కండక్టర్ దగ్గర్నుంచి చివరిరూపాయి వసూలు చేసేదాకా వదలరు. అలా తనకు రావాల్సిన డబ్బుల కోసం ఓ మహిళ పట్టుపట్టడం, కండక్టర్ ఆమెతో గొడవపడటం, ఆమె తరఫు బందువులొచ్చి రభస చేయడం, చివరికి పోలీసుల రంగ ప్రవేశం.. వీటన్నింటినీ అవమానంగా భావించిన కండక్టర్ కదులుతున్న బస్సులో నుంచి నదిలోకి దూకేసిన అనూహ్య సంఘటన ఆదివారం కర్ణాటకలో చోటుచేసుకుంది.

మంగళూరు నుంచి అలంగూరుకు బయలుదేరిన కర్ణాటక ఆర్టీసీ బస్సు కండక్టర్ దేవదాస్ శెట్టి(24) కదులుతున్న బస్సులో నుంచి కుమారధార నదిలోకి దూకి గల్లంతయ్యాడు. బస్సు డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మంగళూరులో బస్సెక్కిన ఓ మహిళ కండక్టర్ కు డబ్బులిచ్చి టికెట్ తీసుకుంది. ఖరీదు పోగా మిగిలిన చిల్లరను ఆమె బస్సు దిగేటప్పుడు ఇచ్చేశాడు కండక్టర్. అయితే తాను ఇచ్చింది రూ.100 కాదని, రూ.500లని ఆ మహిళ కండక్టర్ తో వాదనకు దిగింది. 'కాదూ.. నువ్విచ్చింది వందే'అని కండక్టర్ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీంతో మహిళ తన బంధువులకు ఫోన్ చేసి పిలిపించింది. అంతాకలిసి బస్సును కందబ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

కండక్టర్ దగ్గరున్న బ్యాగ్ ను పోలీసులు తనిఖీ చేయగా టికెట్ల లెక్క కంటే రూ.500 ఎక్కువ ఉన్నట్లు బయటపడింది. ఇక చేసేదేమీలేక కండక్టర్ మహిళకు క్షమాపణలు చెప్పుకున్నాడు. బస్సు మళ్లీ బయలుదేరింది. జరిగిన ఘటనతో తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ఒక చీటీలో రాసి దాన్ని డ్రైవర్ బ్యాగులో ఉంచిన కండక్టర్  బ్రిడ్జి పైనుంచి బస్సు వెళుతుండగా నదిలోకి దూకేశాడు. సదరు మహిళతోపాటు ఆమె బంధువులు, కదంబ పోలీసుల తీరును ఆక్షేపిస్తూ బస్సు డ్రైవర్ సుబ్రహ్మణ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశాడు. నదిలో గల్లైంతైన కండక్టర్ దేవదాస్ శెట్టి ఆచూకీ ఇంకా లభించలేదు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.

మరిన్ని వార్తలు