రూ.10 నాణెంపై అయోమయం!

22 Jul, 2016 16:52 IST|Sakshi
రూ.10 నాణెంపై అయోమయం!

ఫరీదాబాద్: గత రెండు వారాలుగా ఫరీదాబాద్ ప్రజలు రూ.10 నాణెం విషయంలో తికమకపడుతున్నారు. కొంతమంది దుకాణదారులు రూ.10 నాణెం చెల్లుతుందని తీసుకుంటుంటే.. మరికొందరు అంగీకరించటం లేదు. దీంతో ప్రజలు నాణ్యాన్ని తీసుకోవాలా? వద్దా? అనే విషయాన్ని ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆర్బీఐ రూ.10 నాణెం చెల్లదని చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడమే ఇందుకు ప్రధానకారణం.

దీంతో రూ.10 నాణ్యాలతో అక్కడి ప్రజలు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. రూ.10 నాణెంను బ్యాంకులో ఇచ్చి పది నోటును తీసుకుంటున్నారు. దీనిపై స్పందించిన నీలమ్ చౌక్ ఎస్బీఐ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని చెప్పారు. ఆర్బీఐ అటువంటి నిర్ణయం ఏం తీసుకోలేదని.. రూ.10 నాణెంను తీసుకోవడానికి తిరస్కరించిన వ్యాపారులు చట్టరీత్యా శిక్షార్హులని పేర్కొన్నారు.

ఇప్పటివరకూ దాదాపు 2వేల పది రూపాయిల నాణ్యాలు బ్యాంకుకు వచ్చినట్లు చెప్పారు. నగరంలోని కొద్ది ప్రాంతాల్లో నాణ్యాలను తీసుకుంటున్నా.. టియాగాన్, పాత ఫరీదాబాద్ లలో తీసుకోవడం లేదని తెలిపారు.
 

మరిన్ని వార్తలు