పెద్దాసుపత్రుల్లో ‘కత్తెర్లు’ లేవు

28 Sep, 2015 02:56 IST|Sakshi
పెద్దాసుపత్రుల్లో ‘కత్తెర్లు’ లేవు

- పరికరాల లేమితో ఆగిపోతున్న ఆపరేషన్లు
- కత్తెర్లు కూడా లేని దుస్థితిలో బోధనాసుపత్రులు
- ఆగిపోయిన 200 అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్లు
- 75 రకాల ప్రధాన పరికరాల కొరత
- నిధులున్నా కొనుగోలు చేయని వైనం

సాక్షి, హైదరాబాద్:
విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రిలో ఓ రోగికి ఈ నెల 24వ తేదీ ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. తీరా చూస్తే సర్జికల్ సూచర్స్ లేవు. దీంతో సర్జరీ వాయిదా పడింది. గుంటూరు జీజీహెచ్‌లో సర్జికల్ సిజర్ లేకపోవడంతో ఆర్థోపెడిక్ సర్జరీలను ఆపేశారు. కేవలం ఆ రెండు ఆసుపత్రుల్లోనే కాదు... రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రుల్లోకత్తెర్లు కూడా లేని పరిస్థితి దాపురించింది. ఓవైపు సర్జరీలు జరగాల్సిన రోగుల జాబితా చేంతాడంత ఉంటుంది.

ఆపరేషన్ థియేటర్లలో పరికరాలు ఉండవు. ఇదీ పరిస్థితి. పరికరాల లేమితో ఆరోగ్యశ్రీ సర్జరీల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్టు స్పష్టమైంది. వీలైనంత త్వరలో విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విమ్స్)ను ప్రారంభించాలని యోచిస్తున్నా పరికరాల లేమితో విమ్స్ ప్రార ంభోత్సవం మరుగున పడింది.
 
నిలిచిపోయిన పరికరాల కొనుగోళ్లు
రాష్ట్రవ్యాప్తంగా ఏ ఆసుపత్రికైనా పరికరాలను రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) కొనుగోలు చేసి ఇస్తుంది. ఇన్నాళ్లూ ఈ సంస్థకు ఎండీ లేక కొనుగోలు వాయిదా వేశారు. కానీ ఎండీ వచ్చాక కూడా ప్రయోజనం లేకుండా పోయింది. రూ.50 కోట్ల విలువైన పరికరాలు కొనుగోలుకు సంబంధించి ఐదు నెలల కిందట టెండర్లు పిలిచి, అవి వివాదం కావడంతో ఆపేశారు. వాటిని ఇప్పటికీ మళ్లీ పిలవలేదు.

దీంతో అత్యంత అవసరమైన అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషీన్లు 200 అవసరమున్నా కొనుగోలు చేయలేని పరిస్థితి. ఇవే కాదు చెవి ఆపరేషన్‌కు మెషీన్లు, డెలివరీ సెట్‌లు వంటివన్నీ బోధనాసుపత్రుల్లోనే లేవంటే ఇక ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పాత టెండర్ల వివాదం విజిలెన్స్ విభాగానికి వెళ్లిందని, అది తేలేవరకూ కొనేది లేదని తేల్చి చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో వైద్యులు ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
వచ్చిన నిధులూ వెనక్కు వెళ్లనున్నాయి...
రాష్ట్రంలోని చాలా ఆస్పత్రులకు కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయి. వచ్చిన నిధులు వెనక్కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా 10 ఎంసీసీ (మదర్ అండ్ చైల్డ్ కేర్) సెంటర్లకు భారీగా పరికరాలు కొనుగోలు చేయాలి. ఈ నిధులు జాతీయ ఆరోగ్యమిషన్ నుంచి వస్తాయి. ఈ పరికరాలు కొనుగోలు చేయకపోతే నిధులు వెనక్కు వెళతాయి.

అలాగే చాలా ఆసుపత్రులకు పరికరాలు కొనుగోలు చేసేందుకు 13వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయి. కానీ వీటిని సరిగా వినియోగించుకోలేని పరిస్థితి. ఈ నిధులు కూడా మార్చిలోగా వాడుకోలేక పోతే వెనక్కు వెళ్లే అవకాశం ఉంది. ఒక విధంగా పరికరాల కొనుగోళ్లలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఉత్సవ విగ్రహంగా మారిపోయింది. ఐఏఎస్ హోదా అధికారి అయితేనే ఇక్కడ నిర్ణయాలు త్వరగా తీసుకోగలరని అక్కడి అధికారులే చెబుతున్నారు.

మరిన్ని వార్తలు