ఐరాస అత్యున్నత కోర్టులో భారత్‌కు ఊరట!

6 Oct, 2016 07:46 IST|Sakshi
ఐరాస అత్యున్నత కోర్టులో భారత్‌కు ఊరట!

ప్రపంచంలో ఏ మూలకు ఉంటుందో కూడా ఎవరికీ సరిగ్గా తెలియని చిన్న దేశం మార్షల్‌ ఐలాండ్స్‌. అణ్వాయుధాల పోటీని పెంచిపోషిస్తున్నదని ఆరోపిస్తూ ఆ చిన్న దేశం ఏకంగా భారత్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి అత్యున్నత కోర్టులో పిటిషన్‌ వేసింది. 16మంది న్యాయమూర్తులతో కూడిన అంతర్జాతీయ న్యాయస్థానం ఈ పిటిషన్‌ను కొట్టేసింది. ఇక, అణ్వాయుధాల విషయంలో బ్రిటన్‌, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మార్షల్‌ ఐలాండ్స్‌ వేసిన పిటిషన్లపై తర్వాత ఉత్తర్వులు వెలువరిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్లు విచారించాలా? లేదా? అన్నది నిర్ణయిస్తామని తెలిపింది.

ప్రపంచానికి అణ్వాయుధాలతో పొంచి ఉన్న ముప్పును అంతర్జాతీయంగా ఈ పిటిషన్లు వెలుగులోకి తెచ్చినట్టు అయింది. అయితే, ఈ పిటిషన్‌పై విచారణకు భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశాల మధ్య తలెత్తే వివాదాలను మాత్రమే విచారించే అధికార పరిధి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉందని, కానీ మార్షల్‌ ఐలాండ్స్‌తో భారత్‌కు ఎప్పుడు అణ్వాయుధాల విషయం వివాదం తలెత్తలేదని, కాబట్టి ఈ అంశం న్యాయస్థాన విచారణ పరిధిలోకి రాదని భారత్‌ పేర్కొంది. భారత వాదనతో ధర్మాసనంలోని 9మంది న్యాయమూర్తులు ఏకీభవించడంతో ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఉత్తర్వులు వెలువరించింది.  

1968నాటి అణ్వాయుధ వ్యాప్తి నిరోధ ఒప్పందాన్ని ప్రపంచదేశాలు ఉల్లంఘిస్తున్నాయని, ముఖ్యంగా బ్రిటన్‌తోపాటు ఈ ఒప్పందంపై సంతకం చేయని భారత్‌, పాకిస్థాన్‌లు అణ్వాయుధ వ్యాప్తి నిరోధం విఫలం అయ్యాయని మార్షల్‌ ఐలాండ్‌ ఆరోపించింది. ఇక, అణ్వాయుధాల విషయంలో చైనా, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌, నార్త్‌ కొరియా, రష్యా, అమెరికాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు కేసులు వచ్చినా.. విచారణ పరిధి కారణంగా వాటిని న్యాయస్థానం విచారించలేకపోయింది.

మరిన్ని వార్తలు