విజృంభిస్తున్న చైన్‌స్నాచర్లు

2 Oct, 2015 03:31 IST|Sakshi
విజృంభిస్తున్న చైన్‌స్నాచర్లు

- మూడు రోజుల్లో 20 గొలుసు దొంగతనాలు
- స్నాచింగ్‌కు యువత అలవాటు  
- పెండింగ్‌లోనే అనేక కేసులు
- ఆనవాళ్లు దొరకక పోలీసుల తంటాలు

సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో చైన్ స్నాచర్లు హడలెత్తిస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో దొంగలు రెచ్చిపోయారు. దాదాపు 20 చోట్ల చోరీలకు పాల్పడి 60 తులాలకు పైగా బంగారాన్ని దోచుకెళ్లారు. నగరాలు, పట్టణాల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా బైక్‌లపై తిరుగుతూ మహిళలను టార్గెట్ చేస్తున్నారు. వారి మెడల్లోని ఆభరణాలను తెంచుకొని ఉడాయిస్తున్నారు. ఈ ఘటనల్లో మహిళలు తీవ్రంగా గాయపడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఒక పక్క ప్రొఫెషనల్స్, మరో పక్క కొత్త నేరగాళ్లు చైన్‌స్నాచింగ్ చేస్తున్నారు.

కొత్త నేరస్తుల రికార్డులు లేకపోవడంతో పోలీసులకు ఈ కేసులు కత్తిమీద సాము అవుతున్నాయి. మరోపక్క నగరాల్లో సీసీటీవీ కెమెరాల డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. మహిళలను టార్గెట్‌గా చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న నేరగాళ్ల ఆనవాళ్లు దొరకక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి బయటి రాష్ట్రాల నుంచి వచ్చి, వెంటనే సొంత ప్రదేశాలకు వెళ్లకుండా వేరే చోటికి వెళ్లి జల్సాలు చేస్తుండటంతో వారి ఆనవాళ్లు కూడా దొరకడం లేదు. ఇటీవల నిజామాబాద్ జిల్లా బికనూరు వద్ద పోలీసులకు పట్టుబడిన దొంగలను విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.

ఆధారాలు లభించిన వాళ్ల సొంతూళ్లకు వెళ్లినా వారు దొరకని పరిస్థితి ఏర్పడింది. నేరగాళ్ల ఆనవాళ్లు దొరకకపోవడంతో సగానికి పైగా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 2012 సంవత్సరంలో 643 చైన్‌స్నాచింగ్‌లు జరగగా, వాటిలో 315 కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. 2013కు చెందిన 340 కేసులు, 2014కు చెందిన 230 కేసులు ఆధారాల్లేక పెండింగ్‌లో ఉండిపోయాయి. వరంగల్‌లో ఈ ఏడాది 62 చైన్ స్నాచింగ్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
 
ఎక్కువ మంది యువతే..
చైన్‌స్నాచర్స్‌పై నమోదవుతున్న కేసుల్లో చాలా మంది సులభంగా బయటికొస్తున్నారు. నేర చరిత్ర ఉంటే తప్ప చైన్‌స్నాచర్లపై పీడీ యాక్ట్ పెట్టడం లేదు. సీసీ కెమెరాల్లో చిక్కిన వారంతా యువతేనని, వారికి ఎటువంటి నేర చరిత్ర లేనందున పట్టుకోవడం కష్టమవుతోందని పోలీసులు వాపోతున్నారు. రాష్ట్రంలో కొత్తగా నేరాల బాటపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు ఎన్‌సీఆర్బీ-2014 గణాంకాలు చెబుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న నేరాల్లో 40 శాతం వరకు యువతే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు