అనూహ్య హత్య.. తెలిసినవారి పనేనా ?

1 Feb, 2014 12:58 IST|Sakshi
అనూహ్య హత్య.. తెలిసినవారి పనేనా ?

అనూహ్య హత్య కేసులో పురోగతి
కుర్లా రైల్వే స్టేషన్‌లో ఆమెతోపాటు మరో వ్యక్తిని గుర్తించిన పోలీసులు
సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు
అనుమానితుడి కోసం కొన సాగుతున్న వేట

 
 సాక్షి, ముంబై:
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్యను తెలిసినవారే హత్య చేశారా..? ముంబై పోలీసులు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతదేహం లభించిన 16 రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కొంత పురోగతి కనబరిచారు. జనవరి 5న కుర్లా రైల్వే స్టేషన్‌లో అనూహ్యతోపాటు మరో వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఆరోజు అనూహ్య ప్రయాణించిన రైలు మూడో నంబరు ప్లాట్‌ఫాంపై ఆగింది. అక్కడ ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులు ఇప్పటికే పరిశీలించినా అందులో పోలీసులకు ఆమె కనిపించలేదు. దీంతో నాలుగు, ఐదో నంబరు ప్లాట్‌ఫాంలపై ఉన్న కెమెరాలను పరిశీలించగా అందులో అనూహ్య కన్పించిందని కుర్లా రైల్వే పోలీసు ఇన్‌స్పెక్టర్ శివాజీ దుమాల్ తెలిపారు. ఆమెతోపాటు ఓ వ్యక్తి మాట్లాడుతున్నట్లు కెమెరాలో రికార్డ్ అయినట్లు వివరించారు. వారిద్దరూ టాక్సీ స్టాండ్ వైపు వెళ్తున్నట్టు కన్పించింది. తర్వాత ఎటు వెళ్లారన్నది తెలియడం లేదు.
 
 ఎవరు ఆ వ్యక్తి..?
 అనూహ్యతో ఉన్న ఆ వ్యక్తి ఎవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది. సీసీటీవీ ఫుటేజీలతో రైల్వే, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల బృందం శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లినట్టు శివాజీ దుమాల్ తెలిపారు. బంధువులకు కెమెరాల్లోని దృశ్యాలను చూపించగా వారు అనూహ్యను మాత్రమే గుర్తించారని, ఆమెతో ఉన్న వ్యక్తిని మొదటిసారిగా చూసినట్టు చెప్పారు. దీంతో అతడు ఎవరన్న విషయంపై ముంబైతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో గాలింపు చేపట్టారు. అతడు ముం బైలో అనూహ్య నివాసం ఉండే ప్రాంతానికి చెందిన వ్యక్తా లేదా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తా అన్న విషయం తేల్చుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హత్య వెనుక ఈయన హస్తం ఉండవచ్చా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు.
 
 నేడు ఫోరెన్సిక్ నివేదిక!
 అనూహ్య హత్య కేసులో కీలకంగా మారిన ఫోరెన్సిక్ నివేదిక శనివారం వెలుగుచూసే అవకాశం ఉంది. ఇక్కడి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరెటీస్ డెరైక్టర్ డాక్టర్ మాల్వే మాట్లాడుతూ.. అతి త్వరలోనే నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ నివేదికతో అనూహ్య హత్య ఎలా జరిగింది, దేనితో హత్య చేశారు.,? ఎప్పుడు జరిగింది..? తదితర వివరాలు తెలియనున్నాయి.
 
 బాంబే హైకోర్టులో పిటిషన్
 అనూహ్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై బాంబే హైకోర్టులో అభాసింగ్ అనే అడ్వొకేట్ పిటిషన్ దాఖలు చేశారు. అనూహ్య రైల్వే స్టేషన్ నుంచి అదృశ్యమైనప్పట్నుంచీ శవం దొరికే వరకు పోలీసులు అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శించారని, దీనిపై సీఐడీతో విచారణ జరిపించాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో సరైన చర్యలు తీసుకోలేని పోలీసులపై కేసు పెట్టేలా ఆదేశించాలని విన్నవించారు.

మరిన్ని వార్తలు