లంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు

27 Mar, 2014 20:50 IST|Sakshi

జెనీవా: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్చార్సీ)లో భారత్ శ్రీలంక మెచ్చే నిర్ణయం తీసుకుంది. లంక మానవ హక్కులను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ఆ దేశానికి వ్యతిరేకంగా అమెరికా మద్దతుతో గురువారం యూఎన్‌హెచ్చార్సీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు గైర్హాజరైంది. ఆచరణసాధ్యం కాని ఈ తీర్మానం లంక సార్వభౌమత్వాన్ని తక్కువ చేసి చూపేలా ఉందని, దర్యాప్తులో అంతర్జాతీయ జోక్యాన్ని రుద్దుతోందని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి దిలీప్ సిన్హా వివరణ ఇచ్చారు.

రాజకీయ సయోధ్యకు శ్రీలంక చేస్తున్న యత్నాలను ఇది పట్టించుకోలేదని, దీని వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయని అన్నారు. భారత్ యూఎన్‌హెచ్చార్సీలో లంకకు వ్యతిరేక తీర్మానాలపై జరిగిన ఓటింగ్‌కు గైర్హాజరవడం ఇదే తొలిసారి. 2009, 2012, 2013ల్లో చేసిన తీర్మానాలకు భారత్ మద్దతిచ్చింది. తాజా తీర్మానం 9 ఓట్ల తేడాతో నెగ్గింది. అనుకూలంగా 23, వ్యతిరేకంగా 12 ఓట్లు పడ్డాయి.
 

మరిన్ని వార్తలు