భారత్‌లోనే మొబైల్ యూజర్ల జోరు..

4 Jun, 2015 01:40 IST|Sakshi
భారత్‌లోనే మొబైల్ యూజర్ల జోరు..

 న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే మొబైల్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (క్యూ1) భారత్‌లో మొబైల్ వినియోగదారులు కొత్తగా 2.6 కోట్లు పెరిగారని టెలికం ఉపకరణాల తయారీ సంస్థ ఎరిక్‌సన్ తెలిపింది. ఈ త్రైమాసికంలో అంతర్జాతీయ మొబైల్ వినియోగదారుల సంఖ్య కొత్తగా 10.8 కోట్లు పెరిగి 720 కోట్లకు చేరిందని పేర్కొంది. మొబైల్ వినియోగదారుల సంఖ్య భారత్‌లోనే (2.6 కోట్లు) అధికంగా పెరుగుతోందని వివరించింది.
 
 దీని తర్వాతి స్థానాల్లో చైనా (80 లక్షలు), మయన్మార్ (50 లక్షలు), ఇండోనేసియా (40 లక్షలు), జపాన్ (40 లక్షలు) ఉన్నాయి. క్యూ1లో జరిగిన మొత్తం మొబైల్ హ్యాండ్‌సెట్స్ విక్రయాల్లో 75 శాతం స్మార్ట్‌ఫోన్లే ఉన్నాయని పేర్కొంది. 2020 నాటికి స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్న వారు 610 కోట్ల మంది ఉంటారని.. అలాగే స్మార్ట్‌ఫోన్ డాటా వినియోగం 10 రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. 4జీ స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్న వారు 60 కోట్ల మంది ఉంటారని తెలిపింది.
 

మరిన్ని వార్తలు