డౌన్‌లోడ్‌లో మనమెంత స్లోనో తెలుసా?

23 Dec, 2016 09:56 IST|Sakshi
డౌన్‌లోడ్‌లో మనమెంత స్లోనో తెలుసా?

ముంబై: నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కోసం కేంద్రం కలలు కంటోంది. హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, అత్యున్నత సైబర్‌ భద్రత ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. కానీ ఒకవైపు పెద్దనోట్ల రద్దు.. మరోవైపు డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలోనూ సైబర్‌ భద్రత విషయంలో దేశం పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. తాజా అంతర్జాతీయ సర్వేలో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ విషయంలో భారత్‌ 96వ స్థానంలో నిలువగా, బ్యాండ్‌విడ్త్‌ అందుబాటు విషయంలో మరీ దారుణంగా 105స్థానంలో ఉంది. ఇంటర్నెట్‌ భద్రత విషయంలోనూ దేశం చాలా వెనుకబడి ఉంది.

డౌన్‌లోడ్‌ స్పీడ్‌ విషయంలో బంగ్లాదేశ్‌, నేపాల్‌ కంటే వెనుకబడి ఉన్న భారత్‌..  ’రాన్సమ్‌వేర్‌ అటాక్‌’ (సైబర్‌ దాడుల) విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాంకులు, రహస్య సమాచారం కలిగిన సంస్థలు లక్ష్యంగా ఇటీవలికాలంలో హ్యాకింగ్‌లు, సైబర్‌ దాడులు పెరిగిపోవడం గమనార్హం. దేశంలో నానాటికీ సైబర్‌ నేరాలు పెరిగిపోతుండటంతో, డిజిటల్‌ లావాదేవీలు జరిపేందుకు సామాన్య ప్రజలు వెనుకాడుతున్నారని, తాము కూడా హ్యాకింగ్‌ బారిన పడి.. వ్యక్తిగత, బ్యాంకింగ్‌ సమాచారం కోల్పోయే అవకాశముందని పలువురు ఆందోళన చెందుతున్నారని సైబర్‌ నిపుణులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్‌లైన్‌లో నిర్వహించే నగదు లావాదేవీలన్నింటికీ తగిన భద్రత కల్పించాలని, ఇందుకు అవసరమైన నిఘా, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. సైబర్‌ నేరాలు అత్యధికంగా జరుగుతున్న దేశాల జాబితాలో భారత్‌ ఆరోస్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇక బ్యాండ్‌విడ్త్‌ అందుబాటు విషయంలో శ్రీలంక, చైనా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, మలేసియా మనకంటే ఎంతో ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఇంటర్నెట్‌ అందుబాటును మరింతగా పెంచడమే కాకుండా.. అటు సైబర్‌ భద్రతను మరింత పటిష్టపరచాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు