ఆనాటి మ్యాచ్‌లో పాక్‌పై 329 కొట్టేశాం!

18 Jun, 2017 20:08 IST|Sakshi
ఆనాటి మ్యాచ్‌లో పాక్‌పై 329 కొట్టేశాం!

ఎంతో ఆసక్తి రేపుతున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ పోరులో పాకిస్థాన్‌ జట్టు అంచనాలకు మించి ఆడి 339 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియాకు విసిరింది. ఐసీసీ టోర్నమెంటు ఫైనల్‌లో నమోదైన రెండో అత్యధిక స్కోరు ఇది. 2003 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా జట్టు చేసిన 359/2 పరుగులు ఇప్పటివరకు అత్యధిక స్కోరు కాగా..రెండో అత్యధిక స్కోరు కూడా భారత్‌కు వ్యతిరేకంగానే నమోదు కావడం గమనార్హం. ఇక 1975లో లార్డ్స్‌ వెస్టిండీస్‌ జట్టు ఆస్ట్రేలియాపై చేసిన 291/8 పరుగులు మూడో అత్యధిక స్కోరుగా ఉంది. ఇక భారత్‌పై పాకిస్థాన్‌ చేసిన రెండో అత్యధిక స్కోరు కూడా ఇదే. 2004లో కరాచీ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ 8వికెట్లకు 344 పరుగులు చేసింది.

అయితే, పాకిస్థాన్‌పై 300 పైచిలుకు భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన చరిత్ర భారత్‌కు ఉంది. 2012 ఆసియా కప్‌లో విరాట్‌ కోహ్లి చెలరేగి 183 పరుగులు చేయడంతో 329 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించింది. టీమిండియాకు ఉన్న బ్యాటింగ్‌ లైనప్‌, బ్యాటింగ్‌లో మన బ్యాట్స్‌మన్ వీరోచిత ప్రతిభను గమనిస్తే.. ప్రస్తుతం ‌339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి భారత్‌ విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు